PM Modi | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రొస్టేట్ క్యాన్సర్‌తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈ మేరకు బైడెన్ కార్యాలయం తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం తాజాగా స్పందించారు.
బైడెన్ ఆరోగ్యం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితి గురించి విని ఆందోళన చెందాను. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వ్యాధి బయటపడినట్లు పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. దీనికి సంబంధించి చికిత్స అందించే విషయమై ఆయన కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
మరోవైపు బైడెన్ అనారోగ్యంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు తెలిసి తాను, మెలానియా చాలా బాధపడ్డామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బైడెన్ పోరాట యోధుడని, క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పారు.
Also Read..
Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్
Supreme Court | భారత్ ధర్మశాల కాదు..! శరణార్థి పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
Indonesia | ఇండోనేషియాలో బద్దలైన లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం.. 6 కిలోమీటర్ల వరకు కమ్మేసిన బూడిద