సిటీబ్యూరో, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఈదురుగాలుల ప్రభావంతో 347 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. కొన్నిచోట్ల 11 కేవీ ఫీడర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడం, ఒక్కసారిగా వర్షపునీరు పడడంతో కొన్నిచోట్ల ఇన్సులేటర్లు ఫెయిలయ్యాయని సిబ్బంది తెలిపారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖి చీఫ్ ఇంచినీర్లు, ఎస్ఈలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. చెట్ల కొమ్మలు, పతంగుల మంజాల అవశేషాల ప్రభావంతో చంచల్గూడ, సలీంనగర్, నూర్ఖాన్బజార్, మలక్పేట, చందూలాల్బారాదరి, సాయిబాబానగర్, హైదర్గూడ వంటి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కొంత ఆలస్యం జరిగింది. ఎక్కువగా నష్టం జరిగిన ప్రాంతాలను సంస్థ డైరెక్టర్ డాక్టర్ నర్సింహులు, చీఫ్ ఇంజినీర్లు పరిశీలించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు పరిశీలించారు.