– ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
నాంపల్లి, ఆగస్టు 08 : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా స్థాయి విద్యా విజ్ఞాన శిక్షణ తరగతులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్య రోజు రోజుకు కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యకు పాడె కట్టి ప్రైవేట్ విద్యా సంస్థల పల్లకి మోస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విద్యా రంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయే తప్పా ఆచరణ గడప దాటలేదన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య, సర్టిఫికెట్ల కోసం ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను వేధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులతో కలిసి బలమైన సమరశీల పోరాటాలు నిర్వహించడం కోసం ఈ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి బలమైన పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హక్కులు అడుక్కుంటే వచ్చేవి కావని, కొట్లాడి సాధించుకుంటేనే వస్తాయని చెప్పిన అంబేద్కర్, భగత్ సింగ్, చేగువేరా ఆశయాలతో పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదా నాయక్, కోరే రమేష్, బుడిగ వేంకటేష్, ముస్కు రవిందర్, జగదీష్, లోహి, జిల్లా ఉపాధ్యక్షుడు మారుపాక కిరణ్, మూడవత్ జగన్ నాయక్, వీరన్న, నవదీప్, ఇనోష్, పవన్, నాంపల్లి మండల నాయకులు గణేష్, వర్షిత్, స్పందన, శ్రీహర్షిత, పూజ, భవాని, వెన్నెల పాల్గొన్నారు.