Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రోస్టేట్ క్యాన్సర్‌తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈమేరకు బైడెన్ కార్యాలయం వెల్లడించింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వ్యాధి బయటపడినట్లు పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. దీనికి సంబంధించి చికిత్స అందించే విషయమై ఆయన కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
బైడెన్ అనారోగ్యంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు తెలిసి తాను, మెలానియా చాలా బాధపడ్డామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బైడెన్ పోరాట యోధుడని, క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పారు.
జో బైడెన్ 2021 నుంచి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌తో జరిగిన చర్చలో విఫలమవడంతో పోటీనుంచి తప్పుకున్నారు. దీంతో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ ఎన్నికల బరిలో నిచారు. అయితే నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే.