జకార్త: ఇండోనేషియాలోని (Indonesia) లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. అగ్నిపర్వత శిఖరం నుంచి 1.2 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగసిపడింది. దీంతో భూమిని, ఆకాశాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తున్నది. ఫ్లోర్స్ ద్వీపంలో ఉన్న లకిలకి అగ్నిపర్వతం సోమవారం ఉదయం 9.36 గంటలకు విస్ఫోటనం చెందిందని ఇండోనేషియా వోల్కనాలజీ ఏజెన్సీ వెల్లడించింది. అంతకుముందు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బద్దలైందని తెలిపింది. దీంతో శిఖరం నుంచి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద వెలువడిందని పేర్కొంది.
బూడిద నుంచి తమనుతాము రక్షించుకునేందుకు ప్రజలు ఫేస్‌మాస్కులు ధరించాలని అగ్నిపర్వత సమీప ప్రాంతాల వాసులకు సూచించింది. ప్రజలు అగ్నిపర్వతం చుట్టుపక్కల ఆరు కిలోమీటర్ల వరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని తెలిపింది. కాగా, 1,584 మీటర్ల (5,197 అడుగులు) ఎత్తున్న లకిలకి అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉన్నది. ఈ ఏడాది మార్చి 21న విస్ఫోటనం చెందింది. అదేవిధంగా గతేడాది నవంబర్ 7న కూడా బద్దలైంది. అగ్నిపర్వత శిఖరం నుంచి 8 వేల మీటర్ల ఎత్తున బూడిద ఎగసిపడింది.