చేర్యాల, ఫిబ్రవరి 24 : సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంత ప్రజలకు అన్ని ఒకే చోటే లభించే విధంగా బీఆర్ఎస్ సర్కారు హయాంలో పట్టణంలో వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ భవనానికి మోక్షమెప్పుడని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన పాలకవర్గం చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్, కౌన్సిలర్లు భవన నిర్మాణ పనులు పూర్తి చేయించి దానిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు డిమాం డ్ చేస్తున్నారు.
చేర్యాల పట్టణంలోని అంగడి బజారులో వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు రూ.3 కోట్లు మంజూరు చేసింది. రూ. 3 కోట్ల నిధుల్లో రూ.2 కోట్ల సర్కారు నిధులు, మరో రూ.కోటి మున్సిపల్ సాధారణ నిధులు ఉపయోగించుకోవాలని జీవో జారీ చేసింది.పట్టణంలో చేపట్టిన వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది.అనేక కారణాలతో పనులు తీవ్ర జాప్యమవుతున్నాయి.దీంతో పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వారంతపు అంగడి కొనసాగే ప్రదేశంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టడంతో నాలుగేండ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మంగళవారం కొనసాగే అంగడి జాతీయ రహదారిపై కొనసాగుతున్నది.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు సైతం ప్రజలకు ఉపయోగపడే వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పూర్తి చేయించేందుకు ఎలాంటి చొరవ చూపడం లేదు.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
చేర్యాల మున్సిపాలిటీలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం మంజూరు చేసిన నిధులతో ప్రారంభించిన పనులు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. మొదటగా స్థల సేకరణలో మున్సిపల్ పాలకవర్గం, స్థ్ధానిక నేతల జోక్యంతో నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. స్థలాన్ని ఎంపిక చేయడం కోసమే ఒక సంవత్సరం పట్టింది.
అనంతరం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు కేవలం ఒక పెద్దపాటి రేకులషెడ్ నిర్మించి దానికి షెటర్లు బిగించి వదిలిపెట్టాడు. రెండు ఎకరాల స్థలం కావాల్సి ఉండగా అందరికీ అందుబాటులో ఉంటుందని, అంగడి కొనసాగే ప్రదేశంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. సరిపడా స్థలం లేక పాత గ్రామ పంచాయతీ భవనం (మున్సిపల్‌గా అవతరించిన తర్వాత మొదటి కార్యాలయం) సైతం తొలగించి ఆ ప్రదేశంలో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు.పనులు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కేవలం గోదాం తలపించే విధంగా రేకుల షెడ్ నిర్మించి వదిలిపెట్టారు.
ఇందులో నాన్‌వెజ్ మార్కెట్ కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేశారు. స్థానికంగా ఉన్న అధికారులు శ్రద్ధ వహించక పోవడం, నాన్‌వెజ్ వ్యాపారం కొనసాగించే వ్యక్తులు సైతం అందులోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ప్రస్తుతానికి గోదాం వలే ఉన్న షెడ్ కాస్తా నిరూపయోగంగా మారింది. వెజ్,నాన్‌వెజ్ నిర్మాణ పనులను పూర్తి చేస్తే పట్టణ ప్రజలతో పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజలకు సైతం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే పనులు పూర్తి చేయాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అసంపూర్తిగా ఉన్న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ భవన నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ పాలకవర్గంతో పాటు పట్టణ ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నిర్మాణ పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. చేర్యాల పట్టణ ప్రజల కోరిక మేరకు అంగడి బజార్‌కు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తాం.
– ముస్త్యాల అరుణాబాల్ నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్, చేర్యాల, సిద్దిపేట జిల్లా