PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో శ్రీలంక (Sri Lanka), థాయ్‌లాండ్ (Thailand)లో పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (External Affairs ministry) తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ముందుగా ఏప్రిల్ 3 – 4 తేదీల్లో ప్రధాని థాయ్‌లాండ్‌లో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర (Paetongtarn Shinawatra) ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా పేటోంగ్టార్న్తో భేటీ కానున్నారు. ఏప్రిల్ 4వ తేదీన బ్యాంకాక్‌లో జరగనున్న ‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (BIMSTEC) కూటమి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలంపై దేశాధినేతలతో చర్చించనున్నారు.
ఆ తర్వాత థాయ్‌లాండ్ పర్యటనను ముగించుకొని ప్రధాని ఏప్రిల్ 4న శ్రీలంక వెళతారు. ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు అనురకుమార దిసనాయకే గతేడాది భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు. మోదీ తన పర్యటనలో రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై చర్చించనున్నారు.
Also Read..
Mamata Banerjee | నేను రాయల్ బెంగాల్ టైగర్ని.. నిరసనకారులకు ధీటుగా బదులిచ్చిన దీదీ