Mark Carney | కెనడా పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధించడంతోపాటు.. తాజాగా వాహన దిగుమతులపై కూడా 25శాతం సుంకాన్ని విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై కెడాన ఘాటుగా స్పందించింది. ఈ చర్యతో అమెరికాతో పాత దోస్తీ ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 3 నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వాహనాలపై 25శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కెనడా ఆటో పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బే. దాదాపు 5 లక్షల ఉద్యోగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్ (Tariffs) ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి మరీ కార్నీ ఒట్టావా చేరుకుని అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అమెరికా (USA)తో వాణిజ్యయుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు.
ట్రంప్ నిర్ణయాన్ని అన్యాయంగా అభివర్ణించిన కార్నీ.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ చర్యతో ఆర్థికవ్యవస్థ బలోపేతం, భద్రత, సైనిక సహకారం విషయంలో అమెరికా-కెనడా మధ్య ఉన్న పాతబంధం నేటితో ముగిసిపోయిందన్నారు. అమెరికా విధిస్తున్న ఈ సుంకాలను తాము ప్రతీకార వాణిజ్య చర్యలతోనే ఎదుర్కొంటామని ప్రకటించారు. ఆ నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ట్రంప్ ఆటో టారిఫ్‌లకు కెనడా ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అగ్రరాజ్యంపై త్వరలో ప్రతీకార సుంకాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
విదేశీ కార్లపై 25 శాతం సుంకం
అమెరికా దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై (Foreign Made Vehicles) 25 శాతం సుంకం (Tariffs) విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్య శాశ్వతమని అధ్యక్షుడు స్పష్టం చేశారు. అమెరికాలో తయారు చేసిన వాహనాలపై ఎలాంటి సుంకం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ సుంకం శాశ్వతంగా ఉంటుంది. యూఎస్‌లో తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్యతో అమెరికాలో విదేశీ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి.
Also Read..
Donald Trump | ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. విదేశీ కార్లపై 25 శాతం సుంకం
King Charles | క్యాన్సర్ చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్.. ఆసుపత్రిలో చేరిన కింగ్ చార్లెస్
Mamata Banerjee | నేను రాయల్ బెంగాల్ టైగర్ని.. నిరసనకారులకు ధీటుగా బదులిచ్చిన దీదీ