Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో దీదీకి నిరసన సెగ తగిలింది. లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (Oxford University)లో ‘సామాజిక అభివృద్ధి మహిళా సాధికారత’ అంశంపై మమతా బెనర్జీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. బెంగాల్ రాష్ట్రంలో చెలరేగిన హింస, ఆర్జీ కార్ వైద్యురాలి (RG Kar Medical College) హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్జీకార్లో హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, విద్యార్థుల నిరసనకు ఏమాత్రం తగ్గని దీదీ.. వారికి ధీటుగా బదులిచ్చారు. ఇలాంటి నిరసనలతో తనను భయపెట్టలేరని వ్యాఖ్యానించారు. తాను రాయల్ బెంగాల్ టైగర్ (royal Bengal tiger)ని అని అన్నారు.
మీరు చెప్పేది వినపడట్లేదని.. గట్టిగా చెప్పండి అంటూ విద్యార్థులకు సూచించారు. మీరు చెప్పేదంతా నేను వింటాను కాస్త ప్రశాంతంగా మాట్లాడండి అని చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన అంశాలను పూర్తిగా విన్న దీదీ.. ఇక్కడ రాజకీయాలు చేయొద్దని చెప్పారు. రాజకీయాలకు ఇది వేదిక కాదని, తాను దేశం తరఫున ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఇలా చేస్తే మీరు మన దేశాన్ని అవమానించినట్లే అంటూ విద్యార్థులకు బదులిచ్చారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో మమతా బెనర్జీ 1990ల నాటి ఓ ఫొటోను ప్రదర్శించారు. తీవ్ర గాయాలతో తలకు కట్టుతో ఉన్న తన ఫొటోను ఆమె చూపించారు. ముందు ఈ చిత్రాన్ని చూసి.. తనను చంపేందుకు ఎలాంటి కుట్రలు జరిగాయో తెలుసుకోండి అంటూ వ్యాఖ్యానించారు.
Also Read..
Chewing gum | చూయింగ్ గమ్‌తో శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్
CA Final Exams | సీఏ ఫైనల్ పరీక్షలు ఇక ఏడాదికి మూడుసార్లు