CA Final Exams | న్యూఢిల్లీ : సీఏ ఫైనల్ పరీక్షలు ఇక ఏడాదిలో మూడుసార్లు జరగనున్నాయి. ప్రస్తుతం ఏడాదికి రెండుసార్లు జరుగుతున్న సీఏ ఫైనల్ పరీక్షలు ఈ సంవత్సరం నుంచి మూడుసార్లు జరుగుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) గురువారం ప్రకటించింది. ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని గత ఏడాది నిర్ణయం తీసుకోగా ఈ ఏడాది సీఏ ఫైనల్ పరీక్షలను కూడా అదే విధంగా మూడుసార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐసీఏఐ తెలిపింది. దీంతో సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ అనే మూడు స్థాయిలు ప్రతి సంవత్సరం సమానంగా మూడు అవకాశాలు కల్పిస్తాయని ఐసీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి, మే, సెప్టెంబర్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్లో పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సులో కూడా మార్పులు జరుగుతాయని పేర్కొంది. గతంలో రెండుసార్లు జరిగే అసెస్మెంట్ టెస్టు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లో మూడుసార్లు జరుగుతాయని ఐసీఏఐ తెలిపింది.