PM-Vidyalaxmi Scheme | న్యూఢిల్లీ, మార్చి 27: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ బీవోబీ.. నూతన ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మి (పీఎం-విద్యాలక్ష్మి) స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీంను ప్రవేశపెట్టింది. ఉన్నత చదువులకోసం ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం-విద్యాలక్ష్మి స్కీంను ప్రవేశపెట్టింది.
ఈ స్కీంనకు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా..పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంట్లోభాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 8,300 శాఖల్లో ఎడ్యుకేషన్ లోన్ సాంక్షనింగ్ సెల్స్, 119 రిటైల్ అసెట్స్ ప్రాసెసింగ్ సెల్స్లను ఏర్పాటు చేసినట్లు బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియర్ తెలిపారు. మొత్తం ప్రాసెసింగ్ పూర్తిస్థాయిలో డిజిటల్లోనే జరుగుతున్నదని, ఈ వినూత్న స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి బ్యాంక్ బీవోబీనేనని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు రూ.7.5 లక్షల వరకు రుణం లభించనున్నదని, దీంట్లో 75 శాతం క్రెడిట్ గ్యారెంటీగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందన్నారు.