భోపాల్ : మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh Polls) కాషాయ సునామీ కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత కొద్దిరోజులుగా తాను మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుస్తూ వారి ఆశీస్సులు కోరుతున్నానని, బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసం కనబరుస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో కూర్చుని లెక్కలు వేసుకుంటున్న వారి అంచనాలకు అందని రీతిలో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఆదరణ లభిస్తోందని అన్నారు.
షజాపూర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ బీజేపీ పట్ల మీరు కనబరిచే ప్రేమ కొందరికి నిద్రను దూరం చేస్తోందని అన్నారు. వారి ముఖాల్లో నవ్వులు మాయమయ్యాయని, టీవీ ఇంటర్వ్యూల్లో వారి మాటలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆగడాలతో ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విధ్వంసం జరిగిందని, కాంగ్రెస్ హయాం సమస్యలతో సంక్లిష్టమైందని అన్నారు. మధ్యప్రదేశ్‌ను కడగండ్ల పాలు కాకుండా బీజేపీ కాపాడిందని గుర్తుచేశారు.
దోపిడీ, అవినీతి, వేధింపులు, అసత్యాలే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండా అని మోదీ దుయ్యబట్టారు. తనకు మూడోసారి అవకాశమిస్తే భారత్‌ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా ఎదిగేలా చేస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భారత్ అయిదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించామని, త్వరలోనే మనం మూడో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ఎదుగుతామని నిపుణులు చెబుతున్నారని అన్నారు. వేగంగా ఎదుగుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు.
Read More :
Delhi Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. క్షీణించిన వాయు నాణ్యత