Amit Shah | ప్రధాన మంత్రి (Prime Minister), ముఖ్యమంత్రి (Chief Minister), మంత్రులు.. ఇలా ఎవరైనా, ఏదైనా కేసులో అరెస్టయి 30 రోజులు జైలులో ఉండాల్సి వస్తే వారి పదవులకు రాజీనామా చేసేలా, అలా చేయకపోతే.. చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను (130th Amendment Bill) కేంద్రం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధిత మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే పార్లమెంటులో ప్రవేశపెట్టారు. విపక్షాల తీవ్ర అభ్యంతరాలతో వాటిని జేపీసీకి పంపారు. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ దుమారానికి కారణమైన ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా స్పందించారు.
‘ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి.. ఎవరైనా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా..? మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా..? పీఎం, సీఎం, లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే.. ఏదైనా కేసులో అరెస్టయితే నెల (30) రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. ఈ నిబంధన ప్రధాన మంత్రికి కూడా వర్తిస్తుంది. ప్రధాని జైలుకు వెళ్తే ఆయన కూడా రాజీనామా చేయాల్సిందే. ప్రధాని పదవికి కూడా ఈ నిబంధన వర్తించేలా స్వయంగా మోదీ (PM Modi)నే దీన్ని సవరణలో చేర్చారు’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
గతంలో ఇందిరాగాంధీ 39వ సవరణను (రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్లను భారత న్యాయస్థానాల నుంచి రక్షించడం) ప్రవేశపెట్టిన విషయాన్ని షా గుర్తు చేశారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో మండపిడ్డారు. ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అలాంటి బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా..? అంటూ మండిపడ్డారు.
ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లేదా అసెంబ్లీలో ఎవరి మెజారిటీని ప్రభావితం చేయదని అమిత్ షా స్పష్టం చేశారు. ఓ సభ్యుడు జైలుకు వెళ్తే.. పార్టీలోని ఇతర సభ్యులు ప్రభుత్వాన్ని నడుపుతారని వ్యాఖ్యానించారు. బెయిల్ పొందాక మళ్లీ వాళ్లు తమ ప్రయాణాన్ని కొనసాగించొచ్చని చెప్పుకొచ్చారు. దీనికి అభ్యంతరం ఏమిటని..? ప్రశ్నించారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదని ఈ సందర్భంగా అమిత్షా వ్యాఖ్యానించారు.
Also Read..
Rahul Mamkootathil | నటి లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
Rekha Gupta | సీఎంను కత్తితో పొడవాలని ప్లాన్ చేసి.. దాడి ఘటనలో కీలక విషయం వెలుగులోకి