Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరాన్ని బుల్డోజర్తో కూల్చివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. యూపీలోని బారాబంకిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. విపక్ష కూటమి విజయం సాధిస్తే రాముడు మళ్లీ టెంట్‌లోకి మారతాడని అన్నారు. ఎక్కడ బుల్డోజర్లు నడపాలో, ఎక్కడ నడపకూడదో వారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నుంచి తెలుసుకోవాలని హితవు పలికారు.
బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్, ఎస్పీలు బానిసలుగా మారిపోయాయని విపక్షాలపై విరుచుకుపడ్డారు. తాను వారి బండారం బయటపెట్టినప్పుడు వారు తాను హిందూ-ముస్లింల మధ్య విభజన చిచ్చు రేపుతున్నానని ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హ్యాట్రిక్ సాధించి కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంలో తాను మూడోసారి అధికార పగ్గాలు చేపడతానని ఈ విషయం జూన్ 4న ప్రపంచమంతటికీ తెలుస్తుందని అన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను కేంద్రం రద్దు చేయడంతో మహిళల మద్దతు బీజేపీకి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లిం తల్లులు, సోదరీమణులు ట్రిపుల్ తలాఖ్ రద్దుతో సంతోషంగా ఉన్నారని వారంతా ఇప్పుడు తమతో ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read More :
Hyderabad | ప్రియుడి మోజులో భర్త హత్య.. గుండెపోటుతో చనిపోయాడని డ్రామా