PM Modi : జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), ఆర్జేడీ, కాంగ్రెస్ జార్ఖండ్‌కు అతిపెద్ద శత్రువులని పాలక జేఎంఎం సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ఏర్పాటుకు ఆర్జేడీ ఇప్పటికీ ప్రతీకారం తీర్చుకుంటున్నదని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ దీర్ఘకాలంగా జార్ఖండ్‌పై విద్వేషం విరజిమ్ముతోందని అన్నారు. గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జేఎంఎం గిరిజనులకు ద్రోహం చేసిందని మండిపడ్డారు.
అటవీ భూములను ఆక్రమించుకున్న వారితో జేఎంఎం చేతులు కలిపిందని విమర్శించారు. బంగ్లాదేశీ, రోహింగ్యాలతో జేఎంఎం కుమ్మక్కైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అడుగుజాడల్లో జేఎంఎం నడుస్తూ బుజ్జగింపు రాజకీయాలను ఒంటబట్టించుకుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బాటలో నడిస్తే బుజ్జగింపు రాజకీయాలు అలవాటవుతాయని, దీంతో దళితులు, గిరిజనులు, బీసీలకు తీరని నష్టం వాటిల్లుతుందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాంచీలో ఆదివారం మోదీ పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
కాంగ్రెస్ బాటలోనే పాలక జేఎంఎం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. జేఎంఎం ఐదేండ్ల పాలనలో జార్ఖండ్‌ను లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఏ రంగాన్నీ వదలకుండా స్కామ్‌లతో రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. నీరు, అటవీ సంపద, భూములు ఇలా ప్రతిచోటా వనరులను దోచేశారని దుయ్యబట్టారు. జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరగానే అవినీతి, కుంభకోణాలను వెలుగులోకి తెస్తామని అన్నారు. విచారణ చేపట్టి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని మోదీ భరోసా ఇచ్చారు. 70 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఉచిత చికిత్స అందిస్తామని గ్యారంటీ ఇచ్చారు.
Read More :
Kranthi Madhav | DGL టైటిల్‌తో విజయ్ దేవరకొండ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివే..!