రంగారెడ్డి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితాలను వెంటనే ప్రకటించాలని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ బృందంలో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు ఉన్నారు. ఈ సందర్భంగా వారు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఈనెల 17న జరిగిన చైర్మన్ ఎన్నిక రిజల్ట్‌ను ప్రకటించకుండా అధికారులు అక్రమంగా నిలిపేశారని.. సుదర్శన్‌రెడ్డిని వెంటనే చైర్మన్‌గా ప్రకటించడంతోపాటు వైస్ చైర్మన్ ఎన్నికను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది కౌన్సిలర్లుగా గెలుపొందారని, అలాగే, స్వతంత్ర అభ్యర్థితోపాటు బీజేపీ అభ్యర్థి మద్దతు ఉందని.. అందులో భాగంగానే ఈ నెల 17న జరిగిన కౌన్సిల్ సమావేశంలో 15 మంది కౌ న్సిలర్లు సుదర్శన్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారని, రిటర్నింగ్ అధికారి కూడా దానిని ప్రకటించారని.. అయితే, వైస్‌చైర్మన్ ఎన్నిక జరుగుతుండగానే హైకోర్టు నుంచి స్టే వచ్చిందని అధికారులు అర్ధాంతరంగా నిలిపేశారని వివరించారు.
19వ వార్డు నుంచి గెలిచిన ఆకుల యాదగిరి గైర్హాజరు కావడంతో ఈనెల 16న నిర్వహించాల్సిన మీటింగ్‌ను ఈ నెల 17న జరిపారన్నారు. కాగా, యాదగిరి కనిపించడంలేదని అధికార పార్టీ నాయకులు ఆయన కుమారుడితో హైకోర్టులో పిటిషన్ వేయించి ఎన్నిక నిర్వహణకు అడ్డంకులు సృష్టించారన్నారు.
అయినా ఆకుల యాదగిరి ఈ నెల 17న జరిగిన కౌన్సిలర్ సమావేశానికి హాజరై ప్రమాణ స్వీకారం కూడా చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా చేతులెత్తి ఓటువేశారని.. మినిట్ బుక్‌లోనూ సంతకం చేశారని వివరించారు. కోరం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే చైర్మన్ ఫలితాన్ని అధికారులు ప్రకటించటం లేదన్నారు. తమరు జోక్యం చేసుకుని చైర్మన్ ఎన్నిక ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్పార్టీ రాజ్యాంగ ప్రక్రియతో సహా తగిన చట్టపరమైన మార్గాలను అనుసరించాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు.