ప్రజాస్వామ్యంలో పాలకుడు సేవకుడు మాత్రమే, యజమాని ప్రజలే. యజమానికి తన సేవకుడు ఏం చేస్తున్నాడో, ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాడో తెలుసుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగానే 2005లో ‘సమాచార హక్కు చట్టం’ (RTI) రూపుదిద్దుకున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ చట్టం.. నేడు తెలంగాణలో అదే పార్టీ అధికారంలో ఉన్నా ‘అపహాస్యం’ పాలవడం అత్యంత విచారకరం. ప్రజాపాలన అంటూ ఊదరగొట్టే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, ఆచరణలో పారదర్శకతను కాలరాస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీఐ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించే విధంగా పోర్టల్‌ను రూపొందించింది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ పోర్టల్‌లో వివిధ విభాగాల్ని అనుసంధానించటానికి చొరవ చూపించట్లేదు. ఇప్పటివరకు కేవలం 17 విభాగాలు మాత్రమే ఆర్టీఐ సేవలను అందిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల విభాగాలు ఉండగా కేవలం 3,323 మాత్రమే ఆ పోర్టల్‌లో రిజిష్టర్ అయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సంబంధించిన జీహెచ్ఎంసీ, ఇతర తహసీల్దార్లు ఆ పోర్టల్‌లో అనుసంధానం కాలేదు.
దానివల్ల హైదరాబాద్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా అడగటానికి ఆన్లైన్లో సాధ్యం కావట్లేదు. ఎంతో కీలకమైన హైదరాబాద్ పరిస్థితే ఇలా ఉంటే ఇక జిల్లాల్లోని విభాగాలు, మండల, గ్రామ స్థాయిల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ దరఖాస్తులు తీసుకునేవాళ్లు లేరు, ఒక వేళ తీసుకున్నా సమాచారం ఇచ్చేందుకు అధికారులు సుముఖంగా లేరు. కొన్నిసార్లు అరకొర సమాచారం పంపించి ఆర్టీఐ దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీనంతటికీ కారణం సాంకేతిక లోపమని అధికారులు చెప్తున్నప్పటికీ ఇదీ కేవలం పారదర్శకతను తొలగించటానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర మాత్రమే.
జవాబుదారీతనంతో ప్రభుత్వం మెలగాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువస్తే.. ఆ చట్టాన్ని తీసుకువచ్చిన పార్టీనే ఆ హక్కుల్ని కాలరాస్తున్నది. ప్రతిపక్ష పార్టీలపై కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్న కాంగ్రెస్ పాలకులు.. ఆ సమాచారాన్ని అడిగితే ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారు. తెలంగాణలోని కేవలం 2 జిల్లాల పోలీస్ స్టేషన్లు మాత్రమే ఆన్లైన్లో ఆర్టీఐ దరఖాసులను స్వీకరిస్తున్నాయి.
హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లో ఏదైనా సమాచారం అడగాలంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడే దరఖాస్తుదారులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసేలా కుట్ర పన్నుతున్నది. ఇక రాష్ట్ర పాలనకు ఆయువుపట్టు అయిన సచివాలయంలో అసలు సమాచార హక్కు చట్టం ఉనికి లేనేలేదు. కేవలం బీసీ సంక్షేమ శాఖ మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులను అనుమతిస్తున్నది. మిగతా విభాగాలేవీ ఆన్లైన్లో కనిపించట్లేదు. ఇక శాసనసభ కార్యాలయం సైతం ఈ పోర్టల్‌లో దరఖాస్తులు తీసుకోవట్లేదు.
ముఖ్యమంత్రి కార్యాలయం స్థాయిలోనే పారదర్శకత లేకుండా అన్నీ తొక్కి పెడితే కింది స్థాయిలోని అధికారులు కూడా అదే ధోరణిని అందిపుచ్చుకుంటున్నారు. ఫైళ్లను తిప్పటం, సమాచారాన్ని ఇవ్వకుండా తప్పించుకోవటం రొటీన్ అయిపోయింది. సచివాలయం నుంచి మొదలు పెట్టి గ్రామ పంచాయతీ వరకూ ఎవరైనా సమాచారం అడిగితే.. వాళ్లని శత్రువులుగా చూస్తున్నారు. వాళ్లను తిప్పించుకొని, వేధించి చివరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఆన్లైన్లో అన్ని విభాగాలు లేకపోవటం వల్ల ప్రజలు సైతం ఆ పోర్టల్‌ను ఉపయోగించుకోవట్లేదు. గత ప్రభుత్వం పోర్టల్‌ను తీసుకువస్తే ఈ ప్రభుత్వం మాత్రం సాంకేతిక సమస్యలను చూపించి ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నది.
ఇప్పటివరకు పోర్టల్‌లో 20 వేల మంది మాత్రమే దరఖాస్తులు అందించారు. ఇక హైదరాబాద్ నగరంలో సామాన్యుడి బతుకును ఛిద్రం చేస్తున్న హైడ్రా గురించి సమాచారం అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా లేరు. కొన్నిసార్లు సమాచారం సాగునీటి శాఖదని, జీహెచ్ఎంసీది అని సమాచారమిచ్చి తప్పించుకుంటున్నది హైడ్రా. చాలామంది అధికారులకు ఆర్టీఐ చట్టం మీద అవగాహన లేదు. వాళ్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచాల్సిన అవసరమున్నది.
రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో సుమారు 98 శాతం సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం సమాచారం ఇవ్వటానికి ఇంతలా ఎందుకు భయపడుతున్నది. ఇలా సమాచారాన్ని తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. సమాచార కమిషన్ దగ్గర సుమారు 15 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ ఏడాది నివేదికలో స్పష్టం చేసింది. ఇవి ప్రతి ఏడాదీ పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. చాలా అప్పీళ్ల విషయంలో కమిషన్ ఉదాసీనతతో వ్యవహరిస్తున్నది. కేవలం అధికారులు చెప్పిన వాదననే పరిగణనలోకి తీసుకొని అప్పీళ్లను కొట్టి వేస్తున్నది. సమాచారం ప్రజల హక్కు, దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన కల్పించి, రాష్ట్రంలోని అన్ని విభాగాలను ఆన్లైన్ పోర్టల్‌లో అనుసంధానించాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ)
-డాక్టర్ దాసోజు శ్రవణ్