ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ బాధ్యతారాహిత్య రాజకీయాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి. ఏఐ సమ్మిట్ నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా అదే సమయంలో యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అర్ధనగ్నంగా వేదిక పైనే ప్రదర్శన చేస్తూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వంద దేశాలను ఈ సమ్మిట్‌కు పిలిస్తే 80 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇండియా సాంకేతిక రంగంలో ఎలా దూసుకువెళుతున్నదో ప్రపంచానికి చూపించే అద్భుతమైన అవకాశం ఇది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ తన కురుచ బుద్ధిని ప్రపంచం ముందు ప్రదర్శించింది. 50-60 ఏండ్ల వయసున్న యువజన కాంగ్రెస్ నేతలను సదస్సుకు హాజరైనవారే చితగ్గొట్టి పంపడం ప్రజల్లో చైతన్యానికి నిదర్శనం. వారిని చితగ్గొట్టింది జెన్‌జీ యువతనే.
ప్రత్యేక తెలంగాణ కోసం కొన్ని వందల మంది ప్రాణాలు అర్పించారు. సమాజంలోని సకల జనులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఏ ఒక్కరోజు కూడా దేశం పరువుతీసే విధంగా ఎవరూ వ్యవహరించలేదు. విదేశాల్లో కూడా బతుకమ్మ ద్వారా ఉద్యమ వ్యాప్తి కోసం కృషి చేశారు. కానీ ఢిల్లీలో ఏఐ సమ్మిట్‌లో ప్రపంచం ముందు దేశం పరువు తీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరించినట్టు ఏ ఉద్యమ సంస్థ కూడా వ్యవహరించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంస్కారం మరిచిపోయి ప్రతి సమావేశంలోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషిస్తుంటారు. పార్టీ సమావేశాల్లో కేటీఆర్ సమాధానం చెప్తారు. ఐటీ రంగానికి సంబంధించి ఏ అంతర్జాతీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నా తెలంగాణ ప్రతిష్ఠను పెంచేలా మాట్లాడారు. ఆ సమావేశాల్లో ఒక్క పరుష వ్యాఖ్య పదజాలం వాడలేదు. అక్కడ తెలంగాణ ప్రతిష్ఠ నిలబెట్టడం ముఖ్యం కానీ రేవంత్ ముఖ్యం కాదు. అది రాజనీతిజ్ఞత. కానీ ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నాయకులకు అది లోపించింది.
ఏఐ పుణ్యమా అని ఐటీ దెబ్బతింటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. ఈ రంగం దెబ్బ తింటే ఇతర రంగాలపైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గిందంటూ కాంగ్రెస్ పాలకులు అరకొర సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడంలేదు. ఇప్పటికే రైతు బంధును అటకెక్కించారు. పెన్షన్ నాలుగు వేలకు చేరుస్తామని చెప్పి మరిచిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైరై రెండేండ్ల్లు గడిచినా బెనిఫిట్స్ ఇచ్చే స్థితిలో రేవంత్ సర్కార్ లేదు. ఐటీ దెబ్బతింటే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో రియల్ ఎస్టేట్‌పై భారీగానే ప్రభావం పడింది.
ఏఐ ఇంకా తన విశ్వరూపం చూపకముందే రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలా ఉంటే ఏఐ తన విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో మరి! ఏఐ ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టత లేదు. 18 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాలన్నీ పోతాయని మైక్రోసాఫ్ట్ చెప్తుంటే నిపుణుల వల్ల మన దేశం వారికి ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయని నిలేకర్ లాంటివాళ్లు అంటున్నారు. ఏఐ రంగం ఐటీ ఉద్యోగులను
ఆందోళనకు గురిచేస్తున్న సంగతి వాస్తవం.
2000-2002 మధ్య వచ్చిన డాట్ కామ్ బబుల్ అమెరికాలో అల్లకల్లోలం సృష్టించింది. కానీ తెలుగు నాట అంత ప్రభావం చూపలేదు. దానికి కారణం ఉన్నది. అప్పుడప్పుడే మన యువత ఉద్యోగాల్లో చేరారు. ఉదాహరణకు తండ్రి జీతం పాతిక వేలు అయితే కొడుకు జీతం ఐటీలో అంతకు రెట్టింపు ఉండవచ్చు. డాట్ కామ్ బబుల్ పేలిపోయి ఉద్యోగాలు పోయినా ఆ కుటుంబానికి ఏమీ కాలేదు. ఎందుకంటే.. అప్పటివరకు కూడా ఆ కుటుంబానికి ప్రధాన అండ తండ్రి జీతమే. కానీ అంతకన్నా రెట్టింపు అయినా పిల్లల జీతం ప్రధాన ఆదాయం కాదు. ఈ పాతికేండ్లలో పరిస్థితి మారిపోయింది. ఆనాటి యువతరం ఇప్పుడు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు. చాలా కుటుంబాలకు వీరి జీతమే ప్రధాన ఆదాయం. ఐటీ రంగంలో ఏఐ వల్ల సంక్షోభం తలెత్తితే ఈ కుటుంబాల పరిస్థితి పై ఆలోచిస్తేనే వణుకు పుడుతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఢిల్లీలో ఐదు రోజుల పాటు జరిగిన ఏఐ సమ్మిట్‌లో ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీల సీఈవోలు, దేశాధినేతలు, నిపుణులు భవిష్యత్తు గురించి ఏం చెప్తున్నారు, సంక్షోభాలను అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి అనే అంశాలపై రాజకీయ నాయకత్వం దృష్టి సారించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిష్ఠ, యువత భవిష్యత్తు కన్నా చిల్లర రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చింది.
నాస్కామ్ సమాచారం ప్రకారం.. మన దేశంలో ఐటీ రంగంలో 58 లక్షల మంది పనిచేస్తున్నారు. దేశంలోని 145 కోట్ల జనాభాలో ఇది స్వల్ప సంఖ్య గా అనిపించవచ్చు. కానీ మన దేశ ఎగుమతుల్లో 40 నుంచి 45 శాతం ఐటీ రంగానిదే. మన జీడీపీలో 7.3 శాతం వాటా ఐటీదే. అధికారిక లెక్కల ప్రకారం కర్నాటకలో 15 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, తెలంగాణలో 9 లక్షల మంది ఉన్నారు.
ఏఐ వల్ల బేసిక్ కోడింగ్, టెస్టింగ్, డాటా ఎంట్రీ వంటి ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. అదే సమయంలో ఏఐ ఇంజినీర్స్, డాటా సైంటిస్ట్ వంటి కొత్త జాబ్స్ వస్తాయని అంచనా. మంచి జీతంతో ఐటీ ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఏఐ వల్ల జాగ్రత్తగా ఉంటున్నారు. తొందరపడటం లేదు. ఎక్కువ నైపుణ్యం ఉన్న వారికి కొత్త ఉద్యోగాలు రావచ్చు. సాధారణ నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాలు ప్రమాదంలో పడుతాయి. పెద్ద కంపెనీలు గణనీయ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండడం వల్ల ఐటీ ఆధారిత నగరాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్‌పై ఈ ప్రభావం కనిపిస్తున్నది. బెంగళూరులో ఇండ్లకు డిమాండ్ తగ్గి నిర్మాణం పూర్తయి అమ్ముడుపోని గృహాల సంఖ్య 23 శాతం పెరిగింది. దేశంలోని టాప్ ఏడు నగరాల్లో 5.77 లక్షల యూనిట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే హైదరాబాద్‌లో రియల్డర్లు నిర్మాణాలను తగ్గించి జాగ్రత్త పడ్డారు. జాబ్ క్యాలెండర్ వంద రోజుల్లో స్వర్గం చూపిస్తాం..ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. బూతులతోనే కాలం గడపాలి అనుకొంటున్నది. బూతులతోనే కాలం గడపలేరు. కాలం మారుతున్నది.
-బుద్దా మురళి