సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ఈక్రమంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో వాహనదారుల సౌకర్యార్థం చేపట్టిన ఫ్రీ లెఫ్ట్ మార్గాలను అడ్డుకోవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 9 నుంచి 20 వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 9,142 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం జరిమానాలు విధిస్తున్నామని, చట్టపరమైన చర్యలతో పాటు సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జంక్షన్ల వద్ద ఫ్రీలెఫ్ట్ మార్గాలను అడ్డుకోవద్దని, అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలను పెంచుతుందన్నారు.