కొత్త వ్యవసాయ చట్టాలను సమర్థించుకున్న ప్రధాని

హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ మరోసారి సమర్ధించుకున్నారు. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల మెదళ్లలో దశాబ్ధాల నుంచి కొన్ని అపోహలు ఉండిపోయాయని, అయితే రైతుల్ని మోసం చేయాలని తాము భావించడం లేదని, కొత్త చట్టాలు.. పాత విధానాలను అడ్డుకోలేవు అని, గంగా నది తీరం నుంచి మాట్లాడుతున్నానని, తమ ఉద్దేశాలు కూడా గంగా నదిలా పవిత్రంగా ఉన్నాయని మోదీ అన్నారు. ఒకవేళ అంతకుముందు ఉన్న మార్కెటింగ్ వ్యవస్థే ఉత్తమమైనదని గ్రహిస్తే, మరి ఈ కొత్త చట్టాలు ఎలా అడ్డుకుంటాయని ఆయన అడిగారు. కొత్త మార్కెట్ విధానంతో సాంప్రదాయ మండీలకు ఎటువంటి నష్టం ఉండదని మోదీ అన్నారు. కనీస మద్దతు ధర కూడా మారదని ఆయన తెలిపారు.
సంస్కరణలు అనేవి రైతులకు కొత్త అవకాశాలను కల్పించాయని, రక్షణ కూడా కల్పించిందన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా రైతులకు మార్కెట్ కల్పిస్తున్నామని మోదీ తెలిపారు.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రైతులకు పూర్తి లబ్ధి చేకూరాలని, భారత్లో తయారవుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉందని, మరి రైతులకు అలాంటి మార్కెట్ అందుబాటులో ఉండకూడదా అని ఆయన అన్నారు. గతంలో మండీల బయట జరిగే లావాదేవీలను అక్రమంగా భావించేవారని, అయితే ఆ విధానం చిన్న రైతులకు వ్యతిరేకంగా ఉండేదని, ఎందుకంటే వారు మండీలకు వచ్చేవారు కాదు అని, అయితే కొత్త చట్టాలతో చిన్న చిన్న రైతులు కూడా మండీల బయట తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు ఉంటుందని ప్రధాని తెలిపారు. రైతు వ్యతిరేకులు మాత్రమే కొత్త చట్టాలను నిరసిస్తున్నారని ఆయన విపక్షలపై మండిపడ్డారు.
కొత్త సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలు కల్పించాయన్నారు. ఆ సంస్కరణలతో రైతులకు న్యాయరక్షణ కూడా ఏర్పడిందన్నారు. గతంలో రైతు రుణమాఫీ లాంటి పథకాలను ప్రకటించేవారని, కానీ ఆ ఫలాలు అందరికీ అందేవి కావు అని మోదీ అన్నారు. తాము కల్పిస్తున్న స్వేచ్ఛ వల్ల.. రైతులు తమ ఉత్పత్తులను అధిక ధరకే అమ్మే అవకాశం ఉంటుందన్నారు. కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచాలన్న స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదన అమలు చేశామన్నారు. రైతులకు తమ బ్యాంక్ అకౌంట్లలో ఆ ఫలాలు చేరేటట్లు చేశామని ప్రధాని తెలిపారు. గతంలో ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారని, కానీ ఇప్పుడు వదంతులే ప్రతిపక్షాలకు ఆధారమయ్యారన్నారు. తమ నిర్ణయాలు బాగున్నా.. వాటిని తప్పుగా చిత్రీకరిస్తున్నారన్నారు.