కరీంనగర్, మే 8 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : పోరుబాటలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్ వస్తున్నారు. సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్‌షోలు గ్రాండ్ సక్సెస్ అవుతుండగా.. ఉమ్మడి జిల్లాలో గోదావరిఖని, జగిత్యాలలో రోడ్‌షోలు, వీణవంకలో ఆత్మీయ సమ్మేళనానికి ప్రజలు అశేషంగా తరలివచ్చారు. అభిమాన నేత కేసీఆర్‌కు నీరాజనం పలికారు. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్లో రోడ్‌షో నిర్వహించేందుకు పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. గులాబీ దళపతి హైదరాబాద్ నుంచి రాజీవ్హ్రదారి మీదుగా వస్తారని, నగరంలోని బైపాస్ రోడ్డు ద్వారా ముందుగా రాంనగర్ చౌరస్తాకు చేరుకుంటారని వెల్లడించారు. రాంనగర్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా మొదలై.. మంకమ్మతోట, టుటౌన్ పోలీస్‌స్టేన్, ముకరంపుర మీదుగా తెలంగాణ చౌక్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తన ఇంటిలో బస చేసి, శుక్రవారం సాయంత్రం సిరిసిల్లలో నిర్వహించే రోడ్‌షోకు వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి సిద్దిపేటలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో జరిగే సమావేశంలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ పాలనకు, నేటి కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను స్పష్టంగా వివరించనున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధి గురించి కండ్లముందుంచనున్నారు. ముఖ్యంగా ఎంపీగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానే కాకుండా.. ముందు నుంచీ ఉద్యమంలో అడుగులో అడుగై.. తనతో నడిచిన, నడుస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్, కరీంనగర్ నుంచి గెలువాల్సిన ఆవశ్యకతను వివరించనున్నారు. నేటి కేసీఆర్ రోడ్‌షోకు స్వచ్ఛందంగా జనం తరలి వచ్చే అవకాశముండగా.. ఇదే సమయంలో రాంనగర్ నుంచి తెలంగాణచౌక్ వరకు దారిపొడవునా స్వాగతం పలికేందుకు ప్రజలు ఎక్కడికక్కడ సిద్ధమయ్యారు. ఇటు రోడ్‌షోను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌తోపాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం రోడ్‌షో రూట్ మ్యాప్‌ను ఎమ్మెల్యే గంగుల పరిశీలించారు. తెలంగాణ చౌక్‌లో ఏర్పాట్లను పరిశీలించి లైటింగ్‌పై సూచనలు చేశారు. ఆయనవెంట ఎమ్మెల్సీ భాను ప్రసాద్, నగర మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఉన్నారు.