Parliament Security Breach | లోక్‌సభ (Lok Sabha)లో భారీ భద్రతా వైఫల్యం (Security breach) బయటపడింది. ఇద్దరు ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి కలర్ స్మోక్ వదలడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla) స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
సభలో వారు (ఆగంతకులు) వదిలిన పొగ హానికరమైనది కాదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటనే దానిపై విచారణ చేస్తున్నారన్నారు. విచారణ అనంతరం అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఎంపీల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ ఇద్దరు చొరబాటుదారుల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. పార్లమెంట్ బయట మరో ఇద్దర్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ఓం బిర్లా ( Om Birla) వివరించారు.
విజిటర్ పాసులపై స్పీకర్ నిషేధం
మరోవైపు భద్రతా వైఫల్యం ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఆగంతకుల్లో ఒకరైన సాగర్ శర్మ.. మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా విజిటర్ పాస్‌తో లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. మరో ఆగంతకుడిని మైసూర్‌కు చెందిన మనోరంజన్ డీగా గుర్తించారు. అతను వృత్తిరీత్యా ఇంజినీర్ అని పోలీసులు తెలిపారు. హర్యానాకు చెందిన నీలమ్ (42) అనే మహిళతో పాటు మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే (25) పార్లమెంట్ బయట టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభలో విజిటర్స్ పాసులపై స్పీకర్ ఓం బిర్లా నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విజిటర్స్ పాస్‌లపై నిషేధం అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే..?
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతకులు సభలో టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారి షూ నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది. జీరో అవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఎంపీలు సభనుంచి బయటకు పరుగులు తీశారు. అనూహ్య పరిణామంతో సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. కాగా, పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో సభలోకి ఆగంతకులు ప్రవేశించడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read..
Security breach | లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన ఆగంతకులు
Virat Kohli | చికెన్ టిక్కా తిన్న విరాట్ కోహ్లీ.. షాకవుతున్న నెటిజన్స్.. అసలు ట్విస్ట్ ఇదీ..
Loksabha | బీజేపీ ఎంపీ విజిటర్ పాస్‌తో.. లోక్‌సభలో చొరబడ్డ ఆగంతకులు