లక్నో: అదుపుతప్పిన కారు లోతైన నీటి గుంతలోకి దూసుకెళ్లింది. ఆ కారులో ఉన్న టెకీ తన తండ్రికి ఫోన్ చేసి కాపాడాలని కోరాడు. అక్కడకు చేరుకున్న ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే సహాయక చర్యల్లో ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో నీట మునిగి ఆ టెకీ మరణించాడు. (Noida techie drown in ditch) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని సీతామర్హికి చెందిన 27 ఏళ్ల యువరాజ్ మెహతా, గురుగ్రామ్‌లోని డన్హంబీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల కిందట తల్లి మరణించింది. దీంతో తండ్రితో కలిసి నోయిడాలో నివసిస్తున్నాడు.
కాగా, జనవరి 16న రాత్రి వేళ పని తర్వాత యువరాజ్ తన కారులో ఇంటికి బయలుదేరాడు.
నోయిడాలోని సెక్టార్ 150 వద్ద కారును మలుపు తిప్పేందుకు ప్రయత్నించాడు. అయితే పొగమంచు కారణంగా ముందు ఏమున్నది అన్నది యువరాజ్‌కు కనిపించలేదు. దీంతో ఆ కారు చిన్న గోడను ఢీకొట్టింది. 70 అడుగుల లోతైన నీటి గుంతలోకి కారు దూసుకెళ్లింది.
మరోవైపు కారులో ఉన్న యువరాజ్ వెంటనే తండ్రి రాజ్‌కుమార్‌కు ఫోన్ చేశాడు. తన కారు నీటిలో మునిగిపోతున్నదని, తాను అందులో చిక్కుకున్నట్లు చెప్పాడు. తనను కాపాడాలని కోరాడు. తండ్రి రాజ్‌కుమార్ వెంటనే అక్కడకు చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా ఆలస్యంగా అక్కడకు చేరుకున్నాయి. ఈత గాళ్లు అందుబాటులో లేకపోవడంతో కారు టాప్‌పై ఉన్న యువరాజ్‌ను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. ‘నన్ను కాపాడండి. నాన్న కాపాడు’ అని అతడు అరిచాడు. మొబైల్ టార్చి వెలుగులో తాను ఎక్కడ ఉన్నది అన్నది చూపించాడు. అయినా ఐదు గంటలకు పైగా అతడ్ని కాపాడలేకపోయారు.
చివరకు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ మోనిందర్ అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. తాడు సహాయంతో నీటి గుంతలోకి దిగాడు. అయితే అప్పటికే యువరాజ్ నీటిలో మునిగి మరణించాడు. బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నీటిలో మునిగిన కారును కూడా ఆ తర్వాత బయటకు తీశారు.
అయితే 70 అడుగుల లోతైన నీటి గుంత వద్ద ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయని అధికారుల నిర్లక్ష్యంపై యువరాజ్ తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల ఆందోళనతో అధికారులు ఆ నీటి గుంతను చెత్త, మట్టి, రాళ్లతో నింపే పనులు చేపట్టారు.
Also Read:
Boy Takes Mother’s Body To morgue | ఎయిడ్స్‌తో తల్లి మృతి.. 8 ఏళ్ల ఒంటరి కుమారుడు ఏం చేశాడంటే?
Man Murders Wife | భార్యను హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి