Pahalgam Attack | మంగళవారం మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అడవిలో నుంచి వచ్చిన ఉగ్రమూక పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి గురించిన కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో లష్కరే తాయిబాకు చెందిన ఆదిల్ అహ్మద్ థోకర్ (Adil Ahmed Thoker) అలియాస్ ఆదిల్ గురెస్ కూడా ఉన్నాడు. అయితే, అతడు స్టూడెంట్ వీసా (Student Visa)పై పాకిస్థాన్‌కు వెళ్లి.. టెర్రరిస్ట్‌గా స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలిసింది (Returned With Terrorists).
స్టూడెంట్ వీసాపై వెళ్లి..
ఆదిల్ స్వస్థలం జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గల బిజ్బెహారాలోని గుర్రే గ్రామం. పెహల్గామ్లోని బైసారన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఆదిల్‌ను ప్రధాన సూత్రధారుడిగా పోలీసులు భావిస్తున్నారు. అతను 2018లో స్టూడెంట్ వీసాపై పాకిస్థాన్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఆరేళ్ల తర్వాత 2024లో టెర్రరిస్ట్‌గా.. తన వెంట నలుగురు ఉగ్రవాదులతో స్వదేశంలో అడుగుపెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
కశ్మీర్ టు పాకిస్థాన్
2018లో ఆదిల్ గుర్రేలోని తన నివాసాన్ని విడిచి స్టూడెంట్ వీసాపై దాయాది దేశానికి వెళ్లాడు. అయితే, పాక్‌కు వెళ్లడానికి ముందే అతడు తీవ్రవాదులతో చేతులు కలిపినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులతో ఆదిల్ స్నేహంగా మెలిగినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇక పాక్‌కు వెళ్లిన ఆదిల్.. దాదాపు ఎనిమిది నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులతో కూడా టచ్‌లో లేడు. ఆ సమయంలో అతడు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా శిబిరంలో శిక్షణ పొందినట్లుగా తెలిసింది.
టెర్రరిస్ట్‌గా భారత్‌లోకి ఎంట్రీ..
2024 చివరి నాటికి ఆదిల్ అహ్మద్ థోకర్ భారత్‌లో ప్రత్యక్షమయ్యాడు. 2024 అక్టోబర్‌లో పూంచ్-రాజౌరి సెక్టార్ ద్వారా నియంత్రణ రేఖ దాటి స్వదేశంలో అడుగుపెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే, ఒక్కడిగా దాయాది దేశానికి వెళ్లిన ఆదిల్.. నలుగురు వ్యక్తులతో స్వదేశానికి వచ్చాడు. సరిహద్దుల్లో భద్రతా దళాల నుంచి తప్పించుకుని వారిని దేశంలోకి తీసుకొచ్చాడు. వచ్చిన వారిలో ఒకరు పాక్ జాతీయుడు హషీమ్ ముసా కాగా, మరొకరు పెహల్గామ్ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు సులేమాన్గా అధికారులు గుర్తించారు. వీరు భారత్‌లోకి ప్రవేశించేందుకు థోకర్ కీలక పాత్ర పోషించినట్లుగా నిఘా అధికారులు తెలిపారు.
కశ్మీర్లోకి ప్రవేశించిన తర్వాత థోకర్ ప్రజలకు దూరంగా ఉంటూ అటవీ, పర్వత మార్గాల ద్వారానే తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు తెలిసింది. అనంత్‌నాగ్‌కు వెళ్లే ముందు అతను కిష్త్వార్ను కూడా సందర్శించాడు. సాధారణ రోడ్డు మార్గం గుండా కాకుండా.. గతంలో ఉగ్రవాదులు ఉపయోగించిన సీక్రెట్ ట్రాక్, కొండలు, గుట్టలు, అడవి మార్గాలను థోకర్ ఉపయోగించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
అనంత్‌నాగ్‌లో కొన్ని వారాలపాటు అజ్ఞాతంలోకి..
స్వదేశానికి చేరుకున్న థోకర్ అనంత్‌నాగ్ జిల్లాలో కొన్ని వారాల పాటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో పాకిస్థానీ జాతీయుల్లోని ఒకరితో కలిసి అతను రహస్య ప్రదేశంలో గడిపినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలో వారు ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడికి అనువైన ప్రదేశం, టైమ్ కోసం ఎదురుచూస్తున్న థోకర్ గ్యాంగ్‌కు.. బైసారన్ టూరిస్ట్ ప్లేస్ తెరవడం కలిసొచ్చినట్లు భావిస్తున్నారు. ఇదే సరైన సమయం అనుకున్న ఈ గ్యాంగ్ అదునుచూసి నరమేధానికి పాల్పడినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
పెహల్గామ్ దాడి..
ఏప్రిల్ 22 మధ్యాహ్నం 1:50 గంటల ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసారాన్లో పర్యాటకులే లక్ష్యంగా దాడి జరిగింది. ఆర్మీ దుస్తుల్లో అడవిలో నుంచి వచ్చిన ఉగ్రమూక టూరిస్ట్‌లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రమూక మగవారినే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. కాల్పులకు ముందు మతం అడిగి కాల్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇస్లామిక్ శ్లోకాలను సైతం పఠించాలని ఉగ్రవాదులు డిమాండ్ చేసినట్లు చెప్పారు. శ్లోకాలు పఠించిన వారిని వదిలిపెట్టినట్లు కూడా తెలిపారు. ఐదు నుంచి ఆరుగురు ఉగ్రమూక అడవిలో నుంచి వచ్చి మూడు ప్రదేశాల వైపు పరుగులు తీసింది. అక్కడ పది నిమిషాల్లోనే పని పూర్తి చేసుకుని వచ్చిన దారినే అడవిలోకి పారిపోయినట్లు అధికారులు గుర్తించారు.
థోకర్‌ను అనుమానితుడిగా చేర్చారు
బైసారన్ ఊచకోతలో పాల్గొన్న ఉగ్రమూకలో థోకర్‌ను ప్రధాన నిందితుడిగా జమ్ము పోలీసులు గుర్తించారు. మిగిలిన ఇద్దరిని పాకిస్తాన్ జాతీయులు.. హసీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్‌గా గుర్తించారు. ఈ ముగ్గురి ఊహాచిత్రాలను కూడా అనంత్‌నాగ్ పోలీసులు విడుదల చేశారు. ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని (Anantnag Police) ప్రకటించారు. ‘ఏప్రిల్ 22న పెహల్గామ్లోని బైసరన్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడిన పాకిస్థాన్ జాతీయులు (Pakistan nationals), లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హషీమ్ ముసాలను బంధించడానికి, లేదా మట్టుబెట్టడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చేవారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తాం. వీరి ఆచూకీ చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము’ అని ‘ఎక్స్’లో తెలిపారు.
ఉగ్రవాదుల కోసం వేట..
పెహల్గామ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ముష్కరుల కోసం వేట మొదలు పెట్టారు. కశ్మీర్ లోయను జల్లెడ పడుతున్నారు. అనంత్‌నాగ్, పెహల్గామ్ సహా పలు జిల్లాలు, అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి థోకర్, మరో నిందితుడు త్రాల్‌కు చెందని ఆసిఫ్ షేక్‌కు చెందిన ఇళ్లు పేలుళ్లలో ధ్వంసమయ్యాయి.
దాడిలో ఒక నిందితుడైన ఆసిఫ్ ఫౌజీ.. దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్లో ఉన్న తన ఇంటిని వెతుక్కుంటూ భద్రతా దళాలు వస్తాయని ఊహించి వారు రాగానే యాక్టివేట్ అయ్యేలా ఐఈడీలు ఉంచాడు. అతను ఊహించినట్టే ఇంటిని తనిఖీ చేయడానికి జమ్ముకశ్మీర్ పోలీసులు వెళ్లారు. వారు ఇంట్లోకి రాగానే పేలుడు పదార్థాలు యాక్టివ్ అయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే బయటకు వచ్చిన కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. ఈ ట్రాప్ నుంచి భద్రతా దళాలు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. మరో ఉగ్రవాది ఆదిల్ థోకర్ ఇంట్లో కూడా ఇలాగే బాంబు ద్వారా ట్రాప్ పెట్టినా పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ పేలుళ్లతో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక శుక్రవారం రాత్రి కశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను భద్రతా దళాలు బాంబులతో పేల్చేశాయి.
Also Read..
Pahalgam Attack | కశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా దళాలు
LOC | పాక్ కవ్వింపులు.. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులు