ముంబై: ఆ గ్రామ జనాభా కేవలం 1,500. అయితే మూడు నెలల్లో 27,000కు పైగా జననాలు అక్కడ నమోదయ్యాయి. ఈ విషయం తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు. అతిపెద్ద జనన ధృవీకరణ పత్రాల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Birth Certificate Scam) మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అర్ని తహసీల్‌లోని షెండురుసాని గ్రామ పంచాయతీ జనాభా కేవలం 1,500. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కేవలం మూడు నెలల్లోనే 27,397 జననాలు ఆ గ్రామంలో నమోదయ్యాయి.
కాగా, ఈ విషయం తెలిసి జిల్లా ఆరోగ్య అధికారులు షాక్ అయ్యారు. ఆ గ్రామాన్ని సందర్శించారు. అసాధారణ రీతిలో నమోదైన జననాల ధృవీకరణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దీంతో అతిపెద్ద జనన ధృవీకరణ పత్రాల స్కామ్ బయటపడింది. జనన, మరణ నమోదు వ్యవస్థ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్)ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ సీఆర్ఎస్ లాగిన్ ఐడీ ముంబైకి మ్యాప్ అయ్యిందని తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
మరోవైపు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా పంచాయతీ శాఖ డిప్యూటీ సీఈవో ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. మూడు నెలల్లో నమోదైన 27,397 జననాలు, ఏడు మరణాలు గ్రామ పంచాయతీ పరిధికి వెలుపల ఉన్నట్లు ఆ కమిటీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఆరోగ్య అధికారి ఈ స్కామ్‌పై యావత్మల్ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ సీనియర్ నేత కిరీట్ సోమయ్య బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ నమోదైన జననాల్లో 99 శాతం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులవేనని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ జననాల నమోదులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
Also Read:
Horses Run Across Busy Road | రద్దీ రోడ్డుపై గుర్రాల పరుగులు.. తర్వాత ఏం జరిగిందంటే?