Ponguleti Srinivas Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, మార్చి 6 (నమస్తే తెలంగాణ): హిమాయత్‌సాగర్ చెంతనే 111 జీవోకు తూట్లుపొడుస్తూ గుట్టలను పిండి చేస్తున్న ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ అక్రమ మైనింగ్ వ్యవహారం గుట్టు రట్టు కావడంతో కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది. ఈ వివాదం నుంచి మంత్రి కంపెనీని బయటపడేసేందుకు ‘రాఘవ’ ప్రతినిధులతోపాటు కొందరు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. కొత్తగా మరో కంపెనీని తెరమీదికి తెచ్చారు.
క్రషర్, రెడీమిక్స్ ప్లాంట్ సదరు కంపెనీదేనని, రాఘవ కన్స్ట్రక్షన్స్ సుద్ద పూస అంటూ మాయమాటలు చెప్పి మభ్యపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. నిరుపేదల గుడిసెలపై విరుచుకుపడుతున్న అధికార యంత్రాంగం ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్న క్రషర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. క్లోజర్ ఉత్తర్వులు ఉన్నా రెవెన్యూ, మైనింగ్, పీసీబీ అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదన్న ప్రశ్నలకు సైతం స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా అధికార యంత్రాంగం చేష్టలుడిగిప్రేక్షకపాత్ర పోషిస్తుంటే, ప్రజల వనరుల్ని అక్రమంగా కొల్లగొడుతున్న వాళ్లు మాత్రం బుకాయింపులతోపాటు బెదిరింపులకు దిగడం కొసమెరుపు.
రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో నిర్వహిస్తున్న క్రషర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు చెందినదని బీఆర్ఎస్ నేతలు ఆధారాలు సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కంపెనీ ప్రతినిధి గోపాలకృష్ణ, కొందరు కాంగ్రెస్ నేతలు కలిసి క్రషర్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెల్ల కాగితంపై ఒక ప్రకటన విడుదల చేశారు. 2022లో బుద్వేల్‌లో వంద ఎకరాల భూమిని హెచ్ఎండీఏ వేలం వేయగా అక్కడ లే అవుట్ అభివృద్ధి కాంట్రాక్టును ఎన్సీసీ తీసుకుందని తెలిపారు. ఆ మెటీరియల్‌ను కొత్వాల్‌గూడలో డంపింగ్ చేయగా ‘తిరుమల మెటల్ ఇండస్ట్రీ’ దానిని క్రషింగ్ చేస్తున్నదని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఈ మెటల్‌ను రోడ్డు పనుల కోసం కొనుగోలు చేస్తున్నదని చెప్పుకొచ్చారు. వట్టినాగులపల్లి, కోకాపేట సహా అనేక ప్రాంతాల్లో ఇదే విధానంలో అనేక క్రషర్లు కొనసాగుతున్నాయని చెప్పారు.
తద్వారా సర్కార్ డొల్లతనాన్ని బయటపెట్టారు. తమ కంపెనీ ఇమేజ్ను దెబ్బతీసేలా మాట్లాడితే న్యాయపరమైన పరిణామాలు ఎదురోవాల్సి వస్తుందని ‘రాఘవ’ ప్రతినిధి గోపాలకృష్ణ హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రషర్ల దందాకు పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అనుమతులు లేకుండా క్రషర్ నిర్వహిస్తున్నారన్న బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు. తిరుమల క్రషింగ్ కంపెనీ ప్రతినిధి కుమార్ రాజు మాట్లాడుతూ.. తమ కంపెనీ 1988లోనే అనుమతులు తీసుకున్నదని తెలిపారు. 2008 వరకు కొనసాగిందని, 111 కారణంగా మూతపడిందన్నారు. దీంతో స్థానికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. స్థానికుల కోరిక మేరకు ఇక్కడి భూములను లీజుకు తీసుకొని తిరిగి కంపెనీని కొనసాగిస్తున్నామని వెల్లడించారు. అన్నిరకాల అనుమతులతోనే తాము రాఘవ కన్స్ట్రక్షన్స్కు మెటీరియల్ సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. కానీ ఏ ఒక్క అధికారిక డాక్యుమెంట్‌గానీ, అనుమతి పత్రాలను గానీ చూపలేదు. సంబంధిత డాక్యుమెంట్లు ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరగా ‘ఇస్తాం, ఇస్తాం’ అంటూ అక్కడి నుంచి జారుకున్నారు.