కులకచర్ల (పరిగి), మార్చి 6: ఇండస్ట్రియల్ పార్కు కోసం బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సర్కార్‌ను హెచ్చరించారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం పరిగి మండల పరిధిలోని కాండ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ప్రభుత్వం భూములను తీసుకుంటున్నదని తెలుసుకున్న ఆయన శుక్రవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆ రెండు గ్రామాలను సందర్శించి భూ బాధిత రైతులతో మాట్లాడారు.
బలవంతంగా భూములను గుంజుకోవాలని చూస్తే కాంగ్రెస్ సర్కార్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. భూములను నమ్ముకొని ఉన్న రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. రైతులు కన్నీళ్లు పెట్టుకునే పని ప్రభుత్వం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇండస్ట్రియల్ పార్కు పెట్టాలంటే రైతుల భూములను గుంజుకొని వారిని నిరాశ్రయులను చేయాలా? అని ప్రశ్నించారు. రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
భూ సమస్యపై బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వంతో పోరాడుతామని చెప్పారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాడ్లాపూర్, రాపోల్ రెండు గ్రామాల్లోని రైతులకు వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదని, ప్రజల తరపున ఎంతటి పోరాటమైనా చేస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం వెంటనే ఇండస్ట్రియల్ పార్కు నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.