ముంబై: ‘లడ్కీ బహిన్’ పథకం పక్కదారిపట్టింది. (‘Ladki Bahin’ Scheme) మహిళలకు ఉద్దేశించిన ఈ పథకం కింద పురుషులు కూడా లబ్ధిపొందుతున్నారు. వేలాది మంది మగవారు ఈ స్కీమ్ కింద డబ్బులు అందుకున్నారు. దీంతో ఈ పథకం అమలుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ‘లడ్కీ బహిన్’ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉన్న కుటుంబాల్లోని 21 నుంచి 65 ఏళ్ల వయస్సు మహిళలకు నెలకు రూ.1,500 చెల్లిస్తారు.
కాగా, మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహించిన ఆడిట్లో ఈ పథకం ద్వారా 14,298 మంది పురుషులకు రూ.21.44 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను తారుమారు చేసి మహిళా లబ్ధిదారులుగా పురుషులు నమోదు చేసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పథకం ప్రారంభించిన 10 నెలల తర్వాత ఈ దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది.
మరోవైపు ఈ పథకంలో పెద్ద ఎత్తున అనర్హులు నమోదయ్యారు. ఈ పథకం కింద ప్రతి ఇంటి నుంచి గరిష్టంగా ఇద్దరు మహిళలకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. అయితే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మహిళలు కూడా నమోదయ్యారు. దీంతో 7.97 లక్షలకు పైగా మహిళలు అనర్హులుగా నమోదు కావడంతో అదనంగా రూ.1,196 కోట్లు ఖర్చయింది.
కాగా, ఈ పథకానికి మహిళల వయో పరిమితి 65 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే 65 ఏళ్లు పైబడిన 2.87 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్నట్లు తేలింది. దీని వల్ల ప్రభుత్వం రూ. 431.7 కోట్లు కోల్పోయింది. కారు వంటి నాలుగు చక్రాల వాహనాలు కలిగిన కుటుంబాలకు చెందిన 1.62 లక్షల మంది మహిళలు కూడా ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు ‘లడ్కీ బహిన్’ పథకం అమలు చేసిన మొదటి సంవత్సరంలో రూ.1,640 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ స్కీమ్‌లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ పథకం అమలు, కాంట్రాక్ట్ వెనుక పెద్ద కుట్ర ఉందని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే ఆరోపించారు. సిట్ లేదా ఈడీతో దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read:
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
Raj Thackeray Enters Matoshree | 13 ఏళ్ల తర్వాత.. తొలిసారి మాతోశ్రీలోకి అడుగుపెట్టిన రాజ్ ఠాక్రే
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్.. మాజీ మంత్రి అల్లుడుతో పాటు పలువురు అరెస్ట్