Tejashwi Yadav | బీహార్ (Bihar)లో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) బీహార్ ప్రజలకు తాజాగా కీలక హామీ ఇచ్చారు. నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఇందుకు సంబందించిన ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించారు.
పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తేజస్వి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం గత 20 ఏళ్లుగా యువతకు ఉపాధి కల్పించలేకపోయింది. మీకు మాటిస్తున్నా.. మేము అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఓ చట్టాన్ని తీసుకొస్తాం. 20 నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం ఉండదు. ప్రతీ కుటుంబంలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు.
దీనిపై మేము ఇప్పటికే డేటా సేకరించి సర్వే కూడా నిర్వహించాం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలకు నేను హామీ ఇచ్చాను. అప్పుడు అధికారంలో ఉన్న కొద్ది కాలంలోనే దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించా. తక్కువ సమయంలోనే ఇంత చేశానంటే.. నాకు ఐదేళ్ల పదవీకాలం లభిస్తే ఇంకెంత సాధ్యమవుతుందో ఊహించుకోండి’ అని తేజస్వి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్నారు. ఈ విషయం శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వం గ్రహించలేదు అంటూ వ్యాఖ్యానించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరుగుతుందని సీఈసీ వెల్లడించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగియనుంది.
Also Read..
Forbes List | ఫోర్బ్స్ కుబేరుల జాబితా.. మళ్లీ ముకేశ్ నంబర్-1