Crime news : రోడ్డు పక్కన మూత్ర విసర్జన కోసం ఆగిన గిరిజన మహిళ (Tribal woman) పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఒడిశా (Odisha) రాష్ట్రంలోని అంగుల్ (Angul) జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. అంగుల్ జిల్లాకు చెందిన ఒక గిరిజన మహిళ ఈ నెల 3న తన మేనల్లుడితో కలిసి బైక్‌పై చెండిపాడా ఏరియాలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్తూ మార్గమధ్యలో ఓ పెట్రోల్ పంపు దగ్గర వారు ఆగారు. అక్కడ బైకులో పెట్రోల్ పోసుకుని, పక్కనే ఉన్న హోటల్లో భోజనం చేశారు. ఆ తర్వాత మహిళ మేనల్లుడు హోటల్లో కూర్చోగా.. మహిళ మూత్రవిసర్జన కోసం రోడ్డు పక్కన చెట్లలోకి వెళ్లింది.
అది గమనించిన ముగ్గురు వ్యక్తులు ఆమెను ట్రాక్టర్‌పై మరింత లోపలికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను విడిచిపెట్టారు. సదరు మహిళ ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 6న నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు అని చెప్పారు.