Asaduddin Owaisi : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంపై ఏఐఎంఐఎం చీఫ్ (AIMIM chief) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ చేష్టలు ముఖ్య స్థానంలో ఉన్న బఫూన్ బెదిరింపుల్లా (Bullying by buffoon in chief) ఉన్నాయని ఎద్దేవా చేశారు.
భారత ఎగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకాలను అమలు చేస్తున్నారని, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్స్ 50 శాతానికి చేరాయని అసదుద్దీన్ అన్నారు. ఇది భారతదేశంలోని ఎగుమతిదారులకు, చిరు వ్యాపారాలకు, వాటిలో పనిచేసే ఉద్యోగులకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోకుండా ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి దౌత్యం అనిపించుకోదని విమర్శించారు.
అదేవిధంగా భారత ప్రభుత్వంపై కూడా అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఇంత భారీగా సుంకాలు విధిస్తున్నప్పటికీ, ప్రభుత్వంగానీ, ప్రధాని నరేంద్రమోదీ గానీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే ట్రంప్ తీరును ప్రధాని మోదీ అప్పటికే ఖండించారు. టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌తో రాజీపడే ప్రసక్తేలేదని వ్యాఖ్యానించారు. కాగా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు ఆపడంలేదనే కోపంతో ట్రంప్ భారత వస్తువులపై సుంకాలను అదనంగా 25 శాతం పెంచారు.