Sonam Wangchuk | కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో అలజడి చెలరేగిన అనంతరం అరెస్టై జోధ్‌పూర్ జైలులో ఉన్న వాతావరణ పరిరక్షణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)కు ఊరట లభించలేదు. జాతీయ భద్రతా చట్టం (National Security Act) కింద వాంగ్‌చుక్ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన భార్య వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది.
లద్దాఖ్ (Ladakh)కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండు చేస్తూ సెప్టెంబర్ 25న నిరసనకారులు ఆందోళన చేపట్టగా హింసాకాండ చెలరేగి లెహ్ పట్టణంలో నలుగురు మరణించడంతో జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్‌చుక్‌ని ఎన్ఐఏ అరెస్టు చేసి జోధ్‌పూర్ జైలుకు తరలించింది. జాతీయ భద్రతా చట్టం కింద తన భర్తను అక్రమంగా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి (Gitanjali J Angmo) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 26న అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ తన భర్తను సంప్రదించలేకపోతున్నానని.. కనీసం మాట్లాడనివ్వట్లేదని ఆమె ఆరోపించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గీతాంజలి ఆంగ్మో తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) వాంగ్‌చుక్ నిర్బంధానికి గల కారణాలను కుటుంబానికి అందించలేదని వాదించారు. దీంతో వాంగ్‌చుక్ అరెస్ట్‌కు గల కారణాలను ఆయన భార్యకు ఎందుకు తెలియజేయలేదని సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్రం, జమ్ము కశ్మీర్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
Also Read..
Indian Origin | అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య
Mount Everest | మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది ట్రెక్కర్స్