Eyes Health | పూర్వం ఒకప్పుడు మనుషులకు వయస్సు మీద పడితేనే కంటి చూపు కాస్త మందగించేది. వృద్ధాప్యంలోనూ చాలా మందికి కంటి చూపు స్పష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న వయస్సులోనే చాలా మందికి కంటి చూపు మందగిస్తోంది. చిన్నారులు సైతం కళ్లద్దాలను ఉపయోగిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే కంటి చూపు మందగించడానికి ప్రధానంగా మనం తీసుకునే ఆహారమే ముఖ్య కారణమని వైద్యులు అంటున్నారు. మనం తీసుకునే ఆహారాల వల్ల కంటి చూపు దెబ్బ తింటుందని వారు చెబుతున్నారు. అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను ప్రస్తుతం చాలా మంది తింటున్నారు. వేపుళ్లు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, మాంసం వంటి వాటిని అధికంగా తింటున్నారు. వీటిల్లో ఉండే అనారోగ్యకరమైన కొవ్వులు రక్త నాళాల్లో పేరుకుపోతాయి. ఇవి కళ్లకు రక్త సరఫరాను తగ్గిస్తాయి. దీని వల్ల కళ్లకు కావల్సిన పోషకాలు లభించవు. దీంతో కంటి చూపు మందగిస్తుంది. ఇలా మనం తీసుకునే ఆహారాలు కంటి చూపు లోపించేందుకు కారణమవుతున్నాయి.
వైట్ బ్రెడ్, పాస్తా, చక్కెర పానీయాలు, బేకరీ ఆహారాలను తీసుకుంటే షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. దీర్ఘకాలంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే కళ్లలో ఉండే రెటీనాలోని చిన్నపాటి రక్తనాళాలు దెబ్బ తింటాయి. దీని వల్ల డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. దీంతో క్రమంగా కంటి చూపు మందగిస్తుంది. కనుక ఈ ఆహారాలు కూడా కంటి చూపు దెబ్బ తినేందుకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఉప్పును కూడా అధికంగా తీసుకుంటున్నారు. దీని వల్ల బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే కంటి రెటీనాపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కళ్లలో ద్రవాలు పేరుకుపోయేలా చేస్తుంది. దీని కారణంగా కళ్ల చుట్టూ వాపులకు గురవుతాయి. ఇది కూడా కంటి చూపుపై ప్రభావం చూపిస్తుంది. మద్యం అధికంగా సేవించే వారు తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. దీని వల్ల కళ్లు తరచూ పొడిబారుతుంటాయి. దీర్ఘకాలంలో ఇది కంటి చూపు మందగించేందుకు, కళ్లలో శుక్లాలు ఏర్పడేందుకు కారణం అవుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది.
కంటి చూపు పెరిగేలా చేసేందుకు కూడా మనం ఆహారాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి కంటి సమస్యలను తగ్గిస్తాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. పాలకూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే లుటీన్, జియాజాంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి హానికర కిరణాల బారి నుంచి కళ్లను రక్షించడమే కాదు, కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నారింజ, క్యారెట్లు, చిలగడ దుంపలు, గుమ్మడికాయలను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది. మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీని వల్ల కంటి చూపు పెరుగుతుంది. ముఖ్యంగా కళ్లలోని కార్నియా సురక్షితంగా ఉంటుంది. రేచీకటి తగ్గుతుంది.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ల రెటీనాను సంరక్షిస్తాయి. కళ్లు పొడిబారకుండా చూస్తాయి. కళ్లలో ఎప్పుడూ ద్రవాలు ఉండేలా చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. ఇవి కళ్లలో ఉండే రక్త నాళాలను సంరక్షిస్తాయి. ఆయా రక్త నాళాలు వాపులకు గురికాకుండా చూస్తాయి. దీంతో కళ్లు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటాయి. బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలలో విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. విటమిన్ ఇ వల్ల కళ్లలోని కణాలు సురక్షితంగా ఉంటాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కోడిగుడ్లు, పప్పు దినుసులు, శనగలు వంటి ఆహారాలను కూడా తినవచ్చు. వీటిల్లో ఉండే ప్రోటీన్లు కళ్లను రక్షిస్తాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. ఇలా పలు రకాల ఆహారాలను రోజూ తీసుకుంటూ ఉంటే కళ్లకు జరిగే నష్టాన్ని నివారించవచ్చు. కంటి చూపు మెరుగు పడి కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.