Congress | దేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవలే జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ వరుస పరాజయాలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి ఎదురైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 41 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. తాజా ఫలితాలతో హస్తం పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఇక ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంతమేర పుంజుకున్న విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించగా.. 2019 ఎన్నికల్లో 52 సీట్లు సాధించింది. 2024లో మాత్రం అనూహ్యంగా 99 స్థానాల్లో గెలుపొందింది. ఆ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటోందన్న నమ్మకం కలిగింది. రాజ్యాంగం, రిజర్వేషన్లు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో కాంగ్రెస్ కొంత మేర విజయం సాధించినట్లు విశ్లేషకులు భావించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన హస్తం పార్టీ.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వరుసగా ఓటమి పాలవుతూ వస్తోంది. కనీసం ప్రత్యర్థి పార్టీకి పోటీ కూడా ఇవ్వలేకపోతోంది.
లోక్‌సభ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 10 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగింది. హస్తం పార్టీ ఉత్సాహానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తోడుకావడంతో ఆ పార్టీ సంతోషంలో మునిగిపోయింది. అయితే, ఫలితాల రోజు తొలుత హవా చూపిన హస్తం.. బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో చతికిలపడింది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది.
ఇక ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడి ఘోర పరాజయం పాలైంది. బీజేపీ, శివసేన (షిండే), అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి ‘మహాయుతి’ కూటమిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించాయి. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్- జేఎమ్ఎమ్ కూటమిగా పోటీ చేశాయి. ఇక్కడ మాత్రం విజయం సాధించింది. ఇప్పుడు ఢిల్లీలో కనీసం ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ కాదని.. ఆ పార్టీ మిత్రపక్షాల వల్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్న అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.
Also Read..
Saurabh Bharadwaj | ఆప్‌ను కూలదోసేందుకు అన్ని అధికారాలూ ప్రయోగించారు.. బీజేపీపై ఢిల్లీ మంత్రి ఫైర్
Delhi Election Results | లీడ్‌లోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా.. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోటీ
Delhi Election Results | 43 స్థానాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. కేజీవ్రాల్ సహా ఆప్ అగ్రనేతలు వెనుకంజ