Mumbai metro pillar : ముంబైలో శనివారం మెట్రో పిల్లర్ కూలిన ఘటనలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుడి కుటుంబ సభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. అతడి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ములుంద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ శనివారం మధ్యాహ్నం కూలడంతో రాందాని యాదవ్ అనే వ్యక్తి మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
కాగా.. రాందాని యూపీలోని జౌన్పూర్ గ్రామం, భర్తాని గ్రామ ప్రెసిడెంట్గా సమాజ్వాది పార్టీ తరఫున ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలున్నారు. వారి చదువు, వివాహం నిమిత్తం కుటుంబ సభ్యులు పరిహారం అడుగుతున్నారు. ఆదివారం అతడి కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన స్థలంలో నిరసనకు దిగారు. కుటుంబ సభ్యులతోపాటు, యాదవ సంఘం సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారంతోపాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని చర్చలు జరుపుతున్నారు. పోలీసులు అతడి కుటుంబ సభ్యుల్ని ములుంద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చర్చిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే మోహిత్ కొటేచా, మాజీ ఎంపీ మనోజ్ కోటక్ కూడా వారితో చర్చలు జరుపుతున్నారు. ఈ అంశంపై రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, శనివారం రాత్రి మెట్రో కాంట్రాక్టర్ తరఫున తమను సంప్రదించారని, రూ.15 లక్షలు తమ తరఫున, రూ.5 లక్షలు ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పారని ఆందోళన చేస్తున్న అతడి బంధువులు తెలిపారు. అయితే, ముగ్గురు కూతుళ్ల పోషణకు రూ.20 లక్షలు ఎలా సరిపోతాయని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఇంకా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.