జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. భక్తులంతా ‘హర హర మహాదేవ’ అంటూ శివనామస్మరణలో మునిగిపోయిన వేళ, ఆయన తనదైన శైలిలో సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించి మహేశ్వరుడిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. 10 గంటల పాటు శ్రమించి పంపకాల సూది మొనపై శివయ్య విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు.
శివరాత్రి వ ఏళ దయాకర్ సూదిమొనపై రూపమిచ్చిన శివవ్య విగ్రహం అమితంగా ఆకట్టుకుంటోంది. నాగుపాము పడగ నీడలో శివయ్య కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం చూసేవారిని అబ్బురపరుస్తోంది. పంపకాల సూది మొనపై అత్యంత సూక్ష్మంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు దయాకర్. ఈ విగ్రహం తయారీకి నైలాన్, పెన్సిల్ రంగులను ఉపయోగించానని, ఈ అద్భుత విగ్రహం పూర్తి చేయడానికి సుమారు 10 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు.
ప్రతి పండుగకు ఇలాంటి వైవిధ్యమైన కళాఖండాలను సృష్టిస్తూ దయాకర్ జగిత్యాల జిల్లా కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈసారి శివయ్యపై తన భక్తిని ప్రత్యేకంగా చాటుకున్న ఆయన భక్తులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.