అధికారాన్ని అడ్డుపెట్టుకొని విలువైన భూములను ఎలా కొల్లగొట్టవచ్చో ముఖ్యనేత వర్గం రోజుకో కొత్త దారిని పరిచయం చేస్తున్నది. తాజాగా బొంరాస్‌పేటలో భూ పందేరానికి దిగింది. దశాబ్దాలుగా ఎలాంటి వివాదాలు లేకుండా రైతుల స్వాధీనంలో ఉన్న భూములపై అక్రమార్కులు కన్నేయగా, ముఖ్యనేత ప్రధాన అనుచరుడు తోడయ్యాడు. ఫలితంగా ఓవైపు వందలాది ఎకరాలపై అనధికారిక నిషేధం కొనసాగుతుండగా, మరోవైపు ఊరూపేరు లేని ఓ ఉత్తర్వును అడ్డుపెట్టుకొని రాత్రికిరాత్రే భూముల యజమానుల పేర్లు మారిపోతున్నాయి.
భూ భారతి పోర్టల్‌లో భూములు ‘హారతి’ అవుతున్నాయి. అక్కడితో ఆగకుండా వెంటనే అందులో సగ భాగం ఇతరుల పేరు మీదికి వెళ్లిపోతున్నది. దీంతో 50-50 దందా నడుస్తున్నదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆ ఉత్తర్వుల కోసం రైతులు ఆఫీస్‌లు, నేతల చుట్టూ తిరుగుతున్నా ‘దొరుకడం లేదు’ అన్న సమాధానం రావడం అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నది. ఇల్లు, వాకిలి, పొలాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితా కత్తిని ఝుళిపిస్తున్నది. అయితే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మాత్రం దాదాపు వెయ్యి ఎకరాలపై ‘అనధికారిక నిషేధం’ అమలవుతున్నది.
శామీర్‌పేట మండలం బొంరాస్‌పేటలోని కొన్ని సర్వే నంబర్లలో ఉన్న భూముల లావాదేవీలను అధికారులు తిరస్కరిస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవ యజమానులు ఎవరు పోయినా క్రయ, విక్రయాల మాట దేవుడెరుగు.. అధికారులు కనీసం నాలా అనుమతులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇదేందని అడిగితే.. ఈ భూములపై అనధికారిక నిషేధం ఉన్నదని చెప్తున్నట్టు వాపోతున్నారు. వాస్తవ యజమానులకు తెలియకుండానే రాత్రికిరాత్రే ఎకరాలకు ఎకరాలు భూ బదలాయింపు జరుగుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ‘ముఖ్యనేత’ ప్రధాన అనుచరుడి కనుసన్నల్లో జరుగుతున్న బొంరాస్‌పేట భూ వ్యవహారంలో ప్రఖ్యాత సంస్థ ఐటీసీ కూడా బాధితుల జాబితాలో చేరిందని సమాచారం.
తమకు న్యాయం చేయాలని బాధితులు నెలల తరబడి సర్కార్ పెద్దల నుంచి తహసీల్దార్ వరకు మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కులేదని వాపోతున్నారు. తమకు తెలియకుండానే భూ భారతి రికార్డుల్లో పేర్లు మారిపోతుండటంతో ‘నా భూమి వంతు ఎప్పుడు?’ అని భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగిపోయిన బొంరాస్‌పేట భూ బాధితులు శుక్రవారం మహాధర్నాకు సిద్ధమవుతు న్నారు.
బాధితులు తెలిపిన వివరాల మేరకు బొంరాస్‌పేట భూ భాగోతంపై ‘నమస్తే తెలంగాణ’ కథనమిది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని బొంరాస్‌పేట సర్వే నంబర్ 323 నుంచి 409 వరకు ఉన్న 1,049 ఎకరాల భూములకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో 1950-60 దశకంలో గుడివాడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య శామీర్‌పేట మండలంలో వందలాది ఎకరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే వాటిని నేరుగా తన పేరిట కాకుండా తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించారు.
ఇలా ఆయన కుమారుడు అమరేందర్ బాబుతోపాటు మరో 20 మంది పేరు మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇందులో సుమారు 795 ఎకరాలు పట్టా భూమి కాగా, మరో 255 ఎకరాలు ఇనామ్ భూములు. ఆ తర్వాత ఈ 1,049 ఎకరాలను 21 మంది పంచుకున్నారు. అనంతరం 795 ఎకరాల పట్టా భూముల్లో 258 ఎకరాల వరకు 50బీ సర్టిఫికెట్ల ద్వారా విక్రయించారు. మిగిలిన దాదాపు 537 ఎకరాల్లో కొంత బలరామకృష్ణయ్య పేరిట జీపీఏ చేశారు
ఇలా మొత్తం భూములను అనేక మందికి విక్రయించారు. ఆ భూములను కొనుగోలు చేసినవారు అందులో వ్యవసాయం చేశారు. కాలానుగుణంగా ఆ వందల ఎకరాల భూములను కొన్నవారు ఇతరులకు అమ్ముతూ అనేక మంది చేతులు మారాయి. అదేరీతిన రికార్డుల్లో మ్యుటేషన్లు జరుగుతూ పాస్ పుస్తకాలు కూడా జారీ అవుతూ వచ్చాయి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వారి స్వాధీనంలోనే భూములు ఉండటంతో ఎక్కడా ఏ వివాదం లేకుండా ఉన్నది. ఇలా ప్రస్తుతం బొంరాస్‌పేట సర్వేనంబర్ 323 నుంచి 409 వరకు దాదాపు 400 మందికిపైగా రైతులు ఉన్నారు.
బలరామకృష్ణయ్యకు చెందిన 21 మంది బొంరాస్‌పేటలో భూములు కొనుగోలు చేయడం, విక్రయించడం పూర్తయింది. వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం-1973 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ 21 మందిలోని 17 మందికి అప్పటి అధికారులు నోటీసులు జారీచేశారు. బొంరాస్‌పేటలో ఎంత విస్తీర్ణంలో భూములున్నాయనే దానిపై డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్డీవో ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ఆ 17 మంది.. గ్రామంలో తమ పేరిట ఒక్క గుంట భూమి కూడా లేదని డిక్లరేషన్ ఇచ్చారు. దీనికి అధికారులు సమ్మతించకపోవడంతో.. సదరు 17 మంది వ్యక్తులు తాము భూములను ఎవరెవరికి, ఏ సమయంలో విక్రయించామనే వివరాలు సమర్పించారు.
అంటే బొంరాస్‌పేటలో మాజీ ఎంపీ బలరామకృష్ణయ్యకుగానీ, ఆయన కుటుంబ సభ్యులకుగానీ భూమి లేదని సీలింగ్ డిక్లరేషన్ల రికార్డుల ద్వారా స్పష్టమవుతున్నది. దీనినే బాధిత రైతులు ఆధారాలు సహా చూపుతున్నారు. మరోవైపు 21 మందిలో మిగిలిన నలుగురు వ్యక్తులు ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా కొంత భూమిని సీలింగ్ సర్‌ప్లస్‌గా అప్పట్లోనే అధికారులు నిర్ధారించారు. తర్వాత కాలంలో అధికారులు ఆ భూములను భూమిలేని నిరుపేదలకు అసైన్ చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి.
ఓవైపు భూములు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వారి స్వాధీనంలో ఉండటం, మరోవైపు బలరామకృష్ణయ్యకు చెందిన 17 మంది సీలింగ్ డిక్లరేషన్‌లో కొనుగోలుదారుల వివరాలు ఇవ్వడంతో దశాబ్దాలుగా ఎలాంటి వివాదాలు రాలేదు. కానీ కొన్ని సంవత్సరాల కిందట 1965లో భూములను కొనుగోలు చేసిన 21 మందికి చెందిన వారసులు కొంతమంది తెరపైకి వచ్చారు. తమవాళ్లు గతంలో ఆ భూములను ఎవరికీ విక్రయించలేదని, అవన్నీ నకిలీవంటూ ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో 2016లో 1965నాటి పట్టాదారులు తనకు జీపీఏ ఇచ్చారంటూ దుగ్గిరాల యుగంధర్‌బాబు అనే వ్యక్తి తెరమీదికి వచ్చారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన ‘ఎనీవేర్’ కింద ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు నిబంధన కొనసాగుతున్నది. యుగంధర్‌బాబు దీనిని ఆసరాగా చేసుకొని జీపీఏల ఆధారంగా ఎల్బీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూ విక్రయాలు మొదలుపెట్టారు.
వాటిని కొనుగోలు చేసినవారు మ్యుటేషన్ కోసం సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలకు రావడంతో విషయం బయటపడింది. అసలు భూ యజమానులకు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయారు. సీఎంవోలోని ఓ ఉన్నతాధికారి నేరుగా మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌కు వచ్చి, ఈ భూము ల వ్యవహారంపై విచారణ చేపట్టినట్టు బాధిత రైతు లు చెప్తున్నారు. ఎల్బీనగర్ ఎస్ఆర్వోలో అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కేసీఆర్ ఆదేశాలతో రద్దు చేసినట్టు చెప్పారు. దీంతో తాము ఊపిరి పీల్చుకున్నామని అంటున్నారు.
గతంలో ‘ఎనీవేర్’ రూపంలో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో యుగంధర్‌బాబు మరో రూపంలో తమ భూములపై దండయాత్రకు వచ్చినట్టు బాధిత రైతులు చెప్తున్నారు. అకస్మాత్తుగా కందుకూరు ఆర్డీవో పేరిట ఉత్తర్వులను (ఏ2/2183/1998, 2138/1999) తెరపైకి తీ సుకువచ్చారని తెలిపారు. ఆ ఉత్తర్వులను పరిశీలి స్తే.. అది జారీ అయిన తేదీ నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు బయటికి రాలేదు. దీంతో ఆ ఉత్తర్వులపై రైతుల్లో అనుమాలు మొదలయ్యాయి.
ఈ ఉత్తర్వులపై సంతకం ఉన్న ఆర్డీవోను సంప్రదించగా తాను అలాంటి ఉత్తర్వులను ఇవ్వలేదని ఆయన చెప్పినట్టు బాధిత రైతులు కొందరు తెలిపారు. ఆ ఉత్తర్వుల ఫైల్ కోసం బాధిత రైతులు ఏండ్ల తరబడి తిరిగినా, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా ‘ఆ ఫైలు అందుబాటులో లేదు’ అని అధికారుల నుంచి సమాధానాలు వస్తున్నాయి.
ఆ ఉత్తర్వు ల కాపీపై ఆర్డీవో, రంగారెడ్డి తూర్పు ముద్ర లేదని, ఇతర అనేక సాంకేతిక ఆధారాలతో అవి నకిలీవిగా తాము నిర్ధారణకు వచ్చామని రైతులు చెప్తున్నారు. అదే విషయాన్ని అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఆ ఉత్తర్వుల ఆధారంగా హైకోర్టును ఆశ్రయించగా పరిశీలించాలని మాత్రమే కోర్టు సూచించినట్టు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు 2021లో వచ్చినా, రికార్డుల్లో భూ బదలాయింపులేమీ జరుగలేదని చెప్పారు.
ఓవైపు అసలైన భూ యజమానులకు మాత్రం అనధికారిక నిషేధం అమలవుతుండగా రాత్రికిరాత్రే ఇతరుల పేరు మీదికి భూములు మారిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అనుమానాస్పదమైన ఆర్డీవో ఉత్తర్వులు, తదనుగుణంగా వచ్చిన హైకోర్టు ఉత్తర్వులను ఆసరాగా చేసుకొని భూములు సదరు యుగంధర్‌బాబు పేరుమీదికి మారుతున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఏరోజు ఎవరి భూములు ఇతరుల పేరుమీదికి మారతాయోనన్న భయం వారిని వెంటాడుతున్నది.
ప్రఖ్యాత ఐటీసీ వంటి సంస్థలు కొనుగోలు చేసిన భూములు కూడా బదలాయింపు జరిగిపోయి, యజమానుల పేర్లు మారిపోయాయని సమాచారం. రాత్రికిరాత్రే పేర్లు మారిన తర్వాత, అక్కడితో ఆగడం లేదని, వెంటనే అందులో సగం విస్తీర్ణం ఇతరుల పేరు మీదికి మార్చుతున్నారని చెప్తున్నారు. దీంతో బొంరాస్‌పేట భూముల్లో 50 శాతం కమీషన్ అమలవుతున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బొంరాస్‌పేటలో వందల ఎకరాలపై కన్నేసిన వ్యక్తి అదును కోసం చూస్తున్నట్టు ‘ముఖ్యనేత’ కోటరీకి ఉప్పందింది. ఎప్పటిమాదిరిగానే తక్షణం ముఖ్యనేత అనుచరుడు రంగంలోకి దిగారు. దాంతో రైతులకు గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. ఆ సర్వేనంబర్లలోని భూముల యజమానులు ఎలాంటి లావాదేవీల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లినా తిరస్కరణ మొదలైంది.
భూములను అమ్మడం, కొనడంతోపాటు నాలా అనుమతులు కూడా మంజూరు చేయడం లేదు. ఇదేమంటే దీనిపై హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయనే సాకు చూపుతున్నట్టు బాధిత రైతులు తెలిపారు. ఈ భూములు 22-ఏ నిషేధిత జాబితాలో లేనప్పటికీ, అధికారులు పరోక్షంగా నిషేధాన్ని అమలు చేస్తున్నారని యజమానులు ఆందోళన చెందుతున్నారు.
తమ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ మొదలు సర్కార్ పెద్దల వరకు వందల ఫిర్యాదులు, వినతిపత్రాలు అందించారు. ప్రజాభవన్‌లో జరుగుతున్న ప్రజావాణికి హాజరై వినతిపత్రం ఇవ్వగా, ‘పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోవాలి’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్, ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి మేడ్చల్ కలెక్టర్‌కు సిఫార్సు చేశారు. అయినా అతీగతీ లేకుండా పోయింది.