హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ‘ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నరు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఇది సహించరానిది’ అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై, మంత్రులపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏండ్ల పాటల ప్రవాహంపై రూపొందించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ‘దోపిడీదారుల వెంటపడుతాం. ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు.
తమ సహనాన్ని, ఓపికను చేతగానితనంగా భావించొద్దని, ఇన్నాళ్లు సహనంతో ఉన్నామని ఇక పోరాటమేనని స్పష్టంచేశారు. ఏపూరి సోమన్న వంటి కళాకారులు, ఉద్యమకారులకు తాను అండగా ఉంటానని, వచ్చే ఎన్నికల్లో సోమన్న చట్టసభల్లో అడుగుపెడుతాడని భరోసా ఇచ్చారు. రాజకీయాలను మార్చే శక్తి తనకు ఉన్నదని, నిజాయితీ కలిగిన వారు తన వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో రాజకీయ మార్పు తీసుకురాగలమని ధీమా వ్యక్తంచేశారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. అందుకే ఏపూరిలాంటి కళాకారులు గజ్జె కట్టాలి.. నేను రుమాలు చుడుతా.. అని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి మంచి చేస్తే మంచి అందాం, చెడు చేస్తే దానిని ప్రజలకు విడమరచి చెప్పుదామని తెలిపారు. తన వెంట ప్రజలు ఉన్నారని, అవినీతి, పాచిపోయిన, డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని ఎమ్మెల్యేలు తనకొద్దని తేల్చి చెప్పారు. రానున్న కాలంలో నిజాయితీపరులు, యువకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు దిశగా అడుగులేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్థులు, మహిళలు, విద్యార్థుల కోసం రైతుల కోసం పోరాడుదామని స్పష్టంచేశారు. ఇన్నాళ్లూ సహనంతో ఉన్నానని, ఇక పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు.
పేదోడికి రూ.5 లక్షల ఇల్లు మంజూరు చేసేందుకు 500 రకాల నిబంధనలు పెడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మండిపడ్డారు. తీరా ఇల్లు కట్టుకున్నా ఆటో ఉన్నదనో, ట్రాక్టర్ ఉన్నదనో బిల్లులను ఆపేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజగోపాల్రెడ్డి అధికార పక్షంలో ఉన్నడా? ప్రతిపక్షంలో ఉన్నడా? అంటే తానెప్పుడూ ప్రజల పక్షమేనని తేల్చి చెప్పారు.
తాను గెలిపించిన ఓ ఎమ్మెల్యే కులం కార్డును అడ్డుపెట్టుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, మరికొందరిని ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. పదవులు కిరీటాలు కావని, ప్రజలకు సేవచేసే అవకాశం మాత్రమేనని హితవు పలికారు. ఒకసారి గెలువగానే డబ్బు, అధికారం, పదవిపై వ్యామోహం పెరుగుతుందని, గెలిపించిన ఓటర్లను వారు గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు. తాను డబ్బులిస్తే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో కొందరు నామినేషన్ వేశారని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వారిని గెలిపించానని తెలిపారు. కానీ, తాను పిలిస్తే వారు రారని, అధికారం ఉన్నచోటుకే వెళ్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
తప్పుడు పనులు చేస్తూ కులాన్ని వాడుకోవడం మంచిదికాదని, కులం, మతంకార్డులతో పైకెదిగి వసూలు రాజాలుగా మారిన నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారికి అండగా ఉండాలని, కానీ, అహంకారం పెంచుకోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న నాయకులు గెలువక ముందు ఒక తీరుగా, గెలిచిన తర్వాత మరో తీరుగా మారుతారని చెప్పారు. అలాంటి వారికి తెల్లారే సరికి పెద్దపెద్ద కార్లు ఎలా వస్తున్నాయని, లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పుష్పలీల, పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.