గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 17:49:20

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

ఢిల్లీ : కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం రద్దు చేసింది. ఈ నెల 22 నుంచి వారంపాటు 29వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలకు దేశీయంగా అనుమతిని నిలిపివేసింది. కరోనా విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ర్టాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 65 ఏళ్లు పైబడిన వారు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బందికి మినహాయింపు ఇచ్చింది. పదేళ్లలోపు పిల్లలను ఇంటి నుంచి బయటికి రానివ్వొద్దని సూచించింది.

ప్రభుత్వ, ప్రైవేటురంగంలోని ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే వసతి కల్పించాలని సూచించింది. అత్యవసర, తప్పనిసరి విభాగాల ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ గ్రూప్‌ బీ, సీ కేటగిరీల ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు రావాలని పేర్కొంది. ప్రభుత్వం చేసిన అన్ని సూచనలు రాష్ర్టాలు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలంది. థియేటర్లు, పార్కులు, మ్యూజియంలు మూసివేయాలంది. ప్రజలు ఎక్కువమంది ఒకచోటకు చేరకుండా దూరం పాటించాలని సూచించింది.


logo