Air India plane crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB).. కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివేదిక (preliminary probe report) సమర్పించిన విషయం తెలిసిందే. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ నివేదికపై ఎయిర్ ఇండియా సీఈవో (Air India CEO) క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) తాజాగా స్పందించారు. ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి లోపాలూ లేవని తెలిపారు.
విమానం నిర్వహణకు సంబంధించి తప్పనిసరి పనులన్నీ పూర్తిచేసినట్లు చెప్పారు. ఇంధన నాణ్యతలో లోపాలు, టేకాఫ్ సమయంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులూ లేవని పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు చేసిన బ్రీత్ అనలైజర్ ఫలితాల్లో పైలట్లు పాసైనట్లు వెల్లడించారు. అధికారుల సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు విమానాల్లో తనిఖీలు కొసాగుతూనే ఉంటాయని చెప్పారు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందే విమానాన్ని తనిఖీలు చేశామని.. సేవలకు అనుకూలంగా ఉన్నదని నిర్ధారించుకున్నాకే ఉపయోగించినట్లు చెప్పారు. ఏఏఐబీ సమర్పించిన ప్రాథమిక నివేదిక విషయంలో అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.
జూన్ 12న అహ్మదాబాద్‌లో కూలిపోయి అగ్నికి అహుతైన ఎయిరిండియా విమాన ప్రమాదం ఇంధనం అందనందు వల్లే జరిగిందని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకను తేడాలో ఆగిపోయాయి. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టని మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్టు రిపోర్టులో ఉంది.
కాక్‌పిట్‌లో అవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ‘క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి’ అని నివేదిక తెలిపింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత రెండు స్విచ్‌లు ఎందుకు ఆగిపోయాన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇంధన స్విచ్‌లను ఎయిర్ ఇండియా సంస్థ రెండుసార్లు మార్చినట్లు సమాచారం.
Also Read..
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని
Nimisha Priya: యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష.. ఏమీ చేయలేమన్న కేంద్రం