న్యూఢిల్లీ: యెమెన్‌లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya)ను ఈనెల 16వ తేదీన ఉరి తీయనున్న విషయం తెలిసిందే. ఆమెకు మరణశిక్ష అమలు చేసేందుకు యెమెన్ సర్కారు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఆ మరణదండనను అడ్డుకోవాలని కోరుతూ ఆమె కుటుంబం ఇవాళ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిమిష ప్రియ ఉరిశిక్షను ప్రభుత్వం అడ్డుకోలేదన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇవాళ కోర్టుకు ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇది చాలా దురదృష్టకరమని, కానీ ఏం చేయాలన్న దానిపై పరిమితులు ఉంటాయని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. నిమిషి ప్రియ మరణశిక్ష అమలును అడ్డుకునేందుకు ఒకే ఒక్క దారి ఉందని, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తే నిమిష ప్రియకు శిక్ష తప్పే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. బ్లడ్ మనీ రూపంలో బాధిత కుటుంబానికి 8.6 కోట్లు సమర్పించేందుకు కేరళ నర్సు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిమిష ప్రియ ఉరిని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు అటార్నీ జనరల్ కోర్టులో తెలిపారు. ఇది చాలా సంక్లిష్టమైన కేసు అని ఆయన పేర్కొన్నారు. దీంట్లో ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదన్నారు. వీలైనన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. అన్ని విధాలుగా తమ ప్రయత్నం తాము చేసినట్లు ఆయన తెలిపారు. కానీ దురదృష్టకరమని, ప్రభుత్వానికి కూడా తన విధానంలో కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. బ్లడ్‌మనీ రూపంలో కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు.