FSL Fire Accident | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): నేరాలు జరిగినప్పుడు పోలీసులు సేకరించే కీలకమైన ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించడానికి, నిందితులెవరో తేల్చడానికి తెలంగాణ పోలీసుశాఖకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గుండెకాయ వంటిది. అటువంటి ఓ కీలక విభాగంలో కొన్ని వేల కేసులకు సంబంధించిన ఆధారాలు కాలి బూడిదై నేటికి 15 రోజులవుతున్నది. కొన్ని వందల కేసులకు సంబంధించిన పేపర్ఎవిడెన్స్లు, కొన్ని వేల కేసులకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు అగ్గిలో బూడదయ్యాయని, సుమారు 40-50 కంప్యూటర్లు, వాటి హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఇతర హార్డ్‌డిస్క్‌లు, సెల్ఫోన్లు వంటి ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ శిఖాగోయెల్ మరుసటి రోజు మీడియాతో ధ్రువీకరించారు. చాలావరకు కేసులకు సంబంధించిన ఆధారాలను రిట్రీవ్ చేస్తున్నామని, ఏయే కేసుల్లో ఆధారాలు దొరకలేదో.. కాలిపోయాయో వాటి వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడుతామని, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదని లోతుగా అధ్యయనం చేయకుండానే మీడియాకు చెప్పారు. ఒకవేళ ఉంటే తమ దర్యాప్తులో బయటపడుతుందని అన్నారు. ప్రమాదం జరిగి 15 రోజులైనా ఇప్పటికి ఎలాంటి ఆధారాలు లభించలేదా? ఒకవేళ కుట్రకోణం కాకపోతే ఆధారాలను బయటపెట్టకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలి కదా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కుట్రకోణం ఉన్నా.. అది బయటపెడితే వారి విశ్వసనీయత పెరుగుతుంది కదా? అని అంటున్నారు. ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా ఎఫ్ఎస్ఎల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టలేదు. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పనే లేదు. ఎంతవరకు ఆధారాలు డ్యామేజ్ అయ్యాయో వివరించనే లేదు. దీంతో ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంపై రోజురోజుకూ అనుమానాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అత్యంత కీలకమైన సీజ్డ్ రూమ్, సర్వర్ రూమ్, అనాలసిస్ చాంబర్లలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడమే ప్రశ్నాకర్థకంగా మారి తే.. ఇన్ని రోజులైనా ఆ వివరాలు బయటపెట్టకపోవడం మరిన్ని సందేహాలను రేకెత్తిస్తున్నది.
ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో డీజీపీ శివధర్‌రెడ్డి ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదంపై మాట్లాడుతూ.. ప్రమాదాన్ని విశ్లేషించేందుకు నాగ్‌పూర్ నుంచి ఫైర్ ఫోరెన్సిక్ నిపుణుడైన నీలేశ్ ఉకుందేను రప్పించామని చెప్పారు. సర్వర్ బ్యాకప్‌పై మాట్లాడుతూ.. కాలిపోయిన సర్వర్లను రిట్రీవ్ చేస్తున్నామని చెప్పారు. అందుకోసమే నిపుణులను పిలిపించి.. ప్రమాదం జరిగిన తీరు, దాని తీవ్రత, ఆధారాల ధ్వంసం వంటి వాటిని అంచనా వేయించారు. అయితే, దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో ఎక్కడైనా అత్యంత కీలక విభాగాల్లో అగ్నిప్రమాదం జరిగితే.. వారం, పది రోజుల్లోనే ఆ ప్రమాదం ఎలా జరిగిందో విశ్లేషించి చెప్పగలిగే నీలేశ్ ఉకుందే తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంపై నేటికీ నోరువిప్పకపోవడంపై మరిన్ని అనుమానాలు తలెత్తులున్నాయి. నిరుడు చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంపై, సంగారెడ్డిలోని పాశమైలారంలో చోటుచేసుకున్న కెమికల్ బ్లాస్ట్లను విశ్లేషించిన నీలేశ్ ఉకుందే ప్రమాదానికి గల కారణాలను వారంలోపే చెప్పేశారు. దీంతో ఆయన ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంపై చేతులెత్తేశారా? ఒకవేళ అన్నీ పరిశీలించి నివేదిక ఇచ్చారా? ఇస్తే దానిని ఎందుకు బయటపెట్టలేదు? ఒకవేళ ఇన్నాళ్లూ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? అనేవి ప్రశ్నార్థకంగానే ఉన్నాయి.
ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో ఎవరైనా ఇంటిదొంగలు ఉన్నారా? లేదా రాజకీయ నేతల కుట్రతోనే ఎఫ్ఎస్ఎల్ కాలిపోయిందా? అనే విషయాలపై అటు ఫోరెన్సిక్ నిపుణులు, ఇటు తెలంగాణ పోలీసులు లోతుగానే దర్యాప్తు చేశారు. మొదట అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ విచారించి, వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేశారు. ఆ తర్వాత వచ్చిన సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ నిపుణులు అగ్నిప్రమాదంలో కాలిపోయిన సర్వర్లను, ఇతర సాంకేతిక ఆధారాలను తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజ్‌కు చెందిన చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ఫోరెన్సిక్ ఫైర్ అండ్ సైబర్ ఇన్వెస్టిగేటర్ నీలేశ్ ఉకుందే తనదైన శైలిలో అధ్యయనం చేశారు. ఇంతమంది అధికారులు అన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టినా కూడా.. నేటికీ ఎలాంటి విషయం బయటికి రాకపోవడం, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడం అనుమానించదగిన విషయం.