న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు జూలై 20న తీవ్రమైన బలప్రయోగం జరిపి రెండు వారాలు గడిచినప్పటికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం ఇప్పటివరకు పార్లమెంట్‌లోకి అడుగుపెట్టకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యువ నిరసనకారులపై బాష్పవాయువు, మేకులు అమర్చిన లాఠీలు, పెల్లెట్ గన్లను ఎందుకు ప్రయోగించాయో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు సభలోనూ, వెలుపలా డిమాండ్ చేస్తున్నప్పటికీ అమిత్ షా మాత్రం దీనిపై స్పందించలేదు. ప్రధాన మంత్రి, హోం మంత్రి సభకు హాజరు కాకపోవడం పార్లమెంట్‌కు, ప్రజాస్వామ్యానికి అవమానమని రాజ్యసభలో విపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం విమర్శించారు.