Parishad Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతున్నదా? మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వెనుకడుగు వేస్తున్నదా?పరిషత్ ఎన్నికలే వద్దు అనే ధోరణితోనే సీఎం ఉన్నారా?
ఎన్నికల నిర్వహణ వృథా ప్రయాస అని భావిస్తున్నారా? పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతోనే అలసిపోయాయని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సీఎంకు చెప్పేశారా? రైతు భరోసా వేయకుండా ముందుకెళ్తే నష్టమేనని నివేదికలు హెచ్చరించాయా?
ప్రాదేశిక ఎన్నికలకు వెళ్తే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుందని నిఘావర్గాలు నివేదించాయా? ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చనుబట్టి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా కష్టపడినా పురపాలక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు కూడా పడకపోవడం తో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా మహిళలకు రూ.2,500, తులం బంగా రం, ఆసరా పింఛన్ పెంపు హామీలు ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకొని ఉన్న ట్టు నివేదికలు అందిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి పరిషత్ ఎన్నికలపై విముఖతతో ఉన్నట్టు తెలిసింది. అంతా సవ్యంగా సాగితే జూన్ నెల తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి ఆలోచన చేద్దామని సీఎం రేవంత్‌రెడ్డి సహచర మంత్రులతో అన్నట్టు సమాచారం.
2024 జూన్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. దాదాపు 19 నెలల నుంచి ఆశావహులు ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు కూడా తీరింది. ఈ ఎన్నికలు కూడా నిర్వహించాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మార్చిలో ఎన్నికల ప్రక్రియ ముగించాలని ముందుగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చినట్టు కనిపిస్తున్నా, అధికార పార్టీకి రావాల్సిన స్థాయిలో ఓట్లు పడలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళనతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉన్నదని ప్రభుత్వానికి నివేదికలు అందాయట.
దీనికితోడు గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులు మొదలయ్యాయని, మార్చి నాటికి పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు మరింతగా పెరుగుతాయని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారే ప్రమాదం ఉన్నదని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు యాసంగి సీజన్ రైతుభరోసా డబ్బులు రైతులకు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లలేమని అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇందుకోసం రూ.9 వేల కోట్లు అవసరమని, ఇంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్ రైతుభరోసా ఎగ్గొట్టి, వానకాలం సీజన్లో నిధులు జమ చేసి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఎండాకాలం దాటేవరకు ఎలాంటి ఎన్నికలు పెట్టుకోవద్దని, జూన్ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని తాజాగా నిర్ణయించినట్టు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ కీలక మంత్రి సైతం తన సన్నిహితులతో ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం.
ఈ ఏడాది మార్చి 31లోపు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నది. మార్చి రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై మరోసారి పూర్తిస్థాయి చర్చ పెట్టాలని ఒక వర్గం మంత్రులు సూచించగా.. ఇది ప్రజాక్షేత్రంలో తేలిపోయిన అంశమని, ఇంకా 42 శాతం బీసీ రిజర్వేషన్లపై చర్చ వద్ద్దే వద్దని మరో వర్గం మంత్రులు అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని, కోర్టుల్లో కూడా ఇది త్వరగా తేలే విషయం కాదని మరికొందరు అన్నట్టు సమాచారం. రిజర్వేషన్లపై ఆరాటం తప్ప ప్రజల్లో చర్చే లేదని పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోయిందని, పార్టీపరంగా రిజర్వేషన్లపై కూడా చర్చ అనవసరమని భావిస్తున్నట్టు తెలిసింది.