సంస్థాన్ నారాయణపురం/హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ‘నాకు చదువు రాదు. ఓటీపీ అంటే ఏమిటో తెల్వదు. ఫోన్లో యూరియా బుక్ చేయడం నాకు వస్తలేదు. యూరియా లేక కష్టపడి పండించిన పంట కండ్ల ముందు నాశనం అవుతున్నది. ఒక్క యూరియా బస్తా కూడా దొరుకుత లేదు. యూరియా కష్టాలు చూస్తుంటే కండ్లలో నెత్తురు కారుతున్నది. ఇన్ని తిప్పలు పడే బదులు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తున్నది’ అని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్‌కు చెందిన రైతు దామోదర్‌రెడ్డి గుండెలు బాదుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. యూరియా అందక కడుపు మండి ఆందోళన వ్యక్తంచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదువురాని వారికి, పెద్దఫోన్లు వాడటం రాని తమలాంటి రైతులకు ప్రభుత్వం తెచ్చి యూరియా యాప్ శాపంగా మారిందని పేర్కొన్నారు.
సర్వేల్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ యూరియా కోసం ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేసింది. అక్కడికి వచ్చిన రైతు దామోదర్‌రెడ్డికి ఓటీపీలు రాకపోవడం, ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడంతో యూరియా దొరక్క తీవ్ర నిరాశకు లోనయ్యాడు. నాలుగు రోజులుగా వస్తున్నా ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదని అక్కడ ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. కంటి రెప్పలు మూసి తెరిచే లోపే యూరియా స్టాక్ అయిపోతుందని, ఒక్క యూరియా బస్తా అందించలేని ప్రభుత్వం ఉండటం రైతులు చేసుకున్న దౌర్భాగ్యం అని దుమ్మెత్తి పోశాడు.
స్మార్ట్ఫోన్లు లేని అన్నదాతల పరిస్థితేంటి?: హరీశ్
‘రేవంత్‌రెడ్డి.. యూరియా కోసం రైతుల ఆక్రందనలు వినిపించడంలేదా? ఒక్క బస్తా కోసం వాళ్లు పడుతున్న కష్టాలు కనిపించడంలేదా? యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టే నాటి రోజులు తేవడమేనా మీరు చెప్పిన మార్పు?’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సీఎంపై ప్రశ్నలవర్షం కురిపించారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పడుతున్న వెతలపై హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. యాదాద్రి భువనగిరి జిలాల సర్వేల్లో యూరియా కోసం రైతు దామోదర్‌రెడ్డి వెళ్లగక్కిన ఆక్రోశాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను హరీశ్‌రావు తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. ‘గుండెలు మండి మీ ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాత రోదన మీకు అర్థమవుతున్నదా? అని ప్రశ్నించారు.
ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరిదీ ఇదేపరిస్థితి అని స్పష్టంచేశారు. షాపుల్లో అమ్మాల్సిన యూరియాను, యాపుల్లో ఇస్తామని ఆర్భాటం చేసిన రేవంత్‌రెడ్డి సాధించిందేంటని నిలదీశారు. నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్లులేని లక్షలాది మంది రైతులు ఏ విధంగా యాప్‌ను వినియోగిస్తారన్న కనీస సోయి ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. దేశానికి అన్నంపెట్టే రైతులపై ఇంత కర్కశంగా, కఠినంగా వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నదని చెప్పారు. యూరియా యాప్‌ను రద్దుచేసి పాత విధానంలోనే యూరియా సరఫరా చేయాలని తెలంగాణ రైతాంగం పక్షాన డిమాండ్ చేశారు. లేదంటే యూరియా కష్టాలు భరించలేని రైతులు ‘మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్’ను ముట్టడించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
యాప్‌పై రోడ్డెక్కిన రైతన్న
కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి పీఏసీఎస్ వద్ద వివిధ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం బైఠాయించారు. యాప్‌లో యూరియా స్టాక్ రెండు నిమిషాలు కూడా ఉండటం లేదని వాపోయారు. పంటలకు సరైన సమయంలో యూరియా అందించకపోతే దిగుబడి రాదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడే ఉన్న అధికారులను నిలదీశారు. ఎస్సై సతీష్ అక్కడికి చేరుకొని రైతులకు సర్దిచెప్పారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. యాప్ ద్వారా పంపిణీ ప్రక్రియ గందరగోళంగా ఉన్నదని వాపోయారు. యాప్‌లో యూరియ దొరకడం లేదని, రోజుల తరబడి బస్తాల కోసం ఎదురు చూడాల్సి వస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోలీసులు సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు.
అధిక ధరకు విక్రయాలు
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.266కు బదులు రూ.280 వసూ లు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మీ సెం టర్ నిర్వాహకులు రూ.100 తీసుకుని యూరియా బుక్ చేస్తున్నారని, సామాన్య రైతుకు యూరియా దొరికే పరిస్థితి లేదని మండిపడుతున్నారు.
రైతులను గోసపెడ్తరా?: జీవన్‌రెడ్డి ఆగ్రహం
యూరియా బస్తాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమాలిన పాలన వల్ల ఇటు షాపులోనూ, అటు యాపులోనూ యూరియా దొరకని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. రైతులను గాలికొదిలి ఢిల్లీ పెద్దలకు గులాం గిరీ చేయడం, అమరావతి గురువుకు సలామ్ కొడుతూ తిరగడమే రేవంత్‌రెడ్డికి నిత్యకృత్యమైందని మండిపడ్డారు.