Nirmala Sitharaman | 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభ ముందుంచుతారు. దీంతో ఆమె మరో చరిత్ర సృష్టించారు.
2019లో ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్, ఏడు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన విషయం తెలిసిందే. ఇవాళ సమర్పించిన బడ్జెట్ ఎనిమిదవది. ఈ బడ్జెట్‌తో వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ 10 బడ్జెట్ల రికార్డుకు నిర్మలమ్మ చేరువయ్యారు. అంతేకాదు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమం చేశారు.
పది బడ్జెట్లతో మొరార్జీ దేశాయ్ రికార్డు
కేంద్ర ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఆరు, 1967-1969 మధ్య నాలుగు బడ్జెట్లు సమర్పించారు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంల్లో బడ్జెట్లు సమర్పించారు. 1959 ఫిబ్రవరి 28న తొలిసారి బడ్జెట్ సమర్పించారు. అటుపై 1962లో ఇంటరిం బడ్జెట్, తిరిగి రెండు వార్షిక బడ్జెట్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. నాలుగేండ్ల తర్వాత 1967లో ఇంటరిం బడ్జెట్, 1967-1969 మధ్య మూడు వార్షిక బడ్జెట్లు సమర్పించారు. ఇక మాజీ ఆర్థిక మంత్రులు పి చిదంబరం 9 బడ్జెట్లు, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లను సమర్పించారు.
తొమ్మిది బడ్జెట్లు సమర్పించిన చిదంబరం
వేర్వేరు సమయాల్లో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తొమ్మిది బడ్జెట్లను పార్లమెంట్‌కు సమర్పించారు. తొలిసారి 1996 లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ సమర్పించారు. హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉండగా 1996 మార్చి 19న తొలి బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. తిరిగి 1997లో బడ్జెట్ సమర్పించారు. 2004-08 మధ్య వరుసగా ఐదు బడ్జెట్లను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. కొంత కాలం హోంమంత్రిగా పని చేసిన చిదంబరం.. తిరిగి 2013, 2014ల్లో బడ్జెట్ సమర్పించారు.
ఇందిరాగాంధీ హయాం నుంచి వేర్వేరు సందర్భాల్లో ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. తొలిసారి 1982, 1983, 1984, 2009 ఫిబ్రవరి – 2012 మార్చి మధ్య ఐదు బడ్జెట్లను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు.
ఐదు బడ్జెట్లు సమర్పించిన మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకూ ఐదు బడ్జెట్లు సమర్పించారు. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పని చేశారు.
ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్
2019లో నరేంద్రమోదీ సారధ్యంలో రెండో దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకూ వరుసగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల అనంతరం 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. ఇప్పుడు ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారు.
కాగా, మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.
Also Read..
Union Budget 2025-26 | లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. విపక్షాల నిరసన
Budget 2025 | బడ్జెట్ వేళ.. నిర్మలమ్మకు మిఠాయి తినిపించిన రాష్ట్రపతి