NIA | పెహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2023లో రాజౌరిలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టైన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్ములోని కోట్ భల్వాల్ జైల్లో (Jammu Jail) ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (Lashkar OGW) నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్‌ను ప్రశ్నించింది. పెహల్గామ్ ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉండి ఉంటాయనే అనుమానంతో వారిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది.
కాగా, 2023 జనవరిలో రాజౌరీలోని ధోంగ్రీ గ్రామంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులుకు నిస్సార్, ముస్తాక్ ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి జమ్ము జైలుకు తరలించారు. వీరు లష్కరే హ్యాండ్లర్లకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాజా దాడికి సంబంధించి వీరి ప్రమేయం ఉందన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
పెహల్గామ్ దాడి వెనుక లష్కరే, ఐఎస్ఐ హస్తం..
పెహల్గామ్ దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులో కీలక పురోగతి సాధించింది. ఈ పాశవిక దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలో ప్రణాళిక రచించినట్లు పేర్కొంది. సీనియర్ ఐఎస్ఐ అధికారుల సూచనలతో దాడి జరిపినట్లు తెలిపింది. దాడికి పాల్పడిన ముష్కరుల్లో హష్మి ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్ పాకిస్థాన్ పౌరులుగా అధికారులు గుర్తించారు.
వీరిద్దరూ పాక్కుచెందిన హ్యాండ్లర్లతో టచ్‌లో ఉంటూ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. దాడి అమలుపై వారి సూచనలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాడికి కొన్ని వారాల ముందు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ సాయంతో దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ వర్గాలు వివరించాయి. ఈ దాడిలో ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేసింది. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నారు. కేసుకు సంబంధించి 20 మంది నిరాయుధ టెర్రరిస్టులను, 186 మంది అనుమానితులను ఎన్ఐఏ ప్రశ్నించింది.
Also Read..
Pahalgam attack | పాక్‌కు షాక్.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్ నిషేధం
Supriya Sule | మళ్లీ ఆలస్యం.. ఎయిర్ ఇండియా సేవలపై సుప్రియా సూలే అసహనం