Surgical Strikes |పెహల్గామ్ ఉగ్రదాడి వేళ 2019 పుల్వామా దాడి తర్వాత సరిహద్దు వెంబడి భారత సాయుధ బలగాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించి రాజకీయ వివాదానికి తెరతీశారు కాంగ్రెస్ ఎంపీ (Congress MP), పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi ). సర్జికల్ స్ట్రైక్స్ (surgical strikes) జరిగి ఉంటే ఆధారాలు కనిపించాలి కదా అని ప్రశ్నించారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని విమర్శించారు.
ఈ విషయంలో తాను మొదటి నుంచీ ఆధారాలు అడుగుతున్నట్లు చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి రుజువులూ చూపించడం లేదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా పెహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి జరిగి పది రోజులు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవట్లేదని విమర్శించారు. ఈ దాడికి ప్రతిస్పందనగా పాక్‌పై భారత్ ఎలాంటి చర్య తీసుకుంటుందో అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
చరణ్‌జిత్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని, వైమానిక దళాన్ని కించపరుస్తోందని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా విమర్శించారు. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా తమకు చాలా నష్టం జరిగిందని స్వయంగా పాకిస్థానే చెబుతోందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సైన్యం అబద్ధం చెబుతోందని ఆరోపిస్తోందని మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే తమ నేత రాహుల్‌తో కలిసి పాకిస్థాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇక పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read..
Pahalgam attack | పాక్‌కు షాక్.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్ నిషేధం
Supriya Sule | మళ్లీ ఆలస్యం.. ఎయిర్ ఇండియా సేవలపై సుప్రియా సూలే అసహనం
Russias Victory Day Parade | రష్యా విక్టరీ డే వేడుకలకు రాజ్‌నాథ్ కూడా వెళ్లకపోవచ్చు..!