Lok Sabha Speaker | 18వ లోక్‌సభ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రెండు రోజులూ.. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెం స్పీకర్ బర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. ఇక మూడోరోజైన ఇవాళ స్పీకర్ (Lok Sabha Speaker)ను ఎన్నుకోనున్నారు. అయితే, స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో గత 50 ఏండ్లలో తొలిసారిగా, స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనున్నది.
ఈ నేపథ్యంలో లోక్‌సభ సభ్యులు ఇప్పటికే పార్లమెంట్‌కు చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, చిరాగ్ పాశ్వాన్, గిరిరాజ్ సింగ్, అనుప్రియా పటేల్, ధర్మేంద్ ప్రదాన్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు బసవరాజ్ బొమ్మై, కంగనా రనౌత్ సహా అధికార, విపక్ష కూటమి పార్టీల ఎంపీలు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. మరికాసేపట్లో స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఎన్డీయే కూటమి తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి తరఫున సీనియర్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో 18వ లోక్‌సభ స్పీకర్ ఎవరనేది తేలనుంది.
సంఖ్యాబలం రీత్యా విపక్షానికి అనుకూలంగా లేకున్నా, పార్లమెంట్ సమావేశానికి హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీతో స్పీకర్ ఎన్నికవుతారు. ఎన్డీఏ కూటమి 293, కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా బ్లాక్ కు 232 ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికలో అధికార పక్షం అభ్యర్థి ఓం బిర్లా ముందంజలో ఉన్నట్లు ఎన్నికకు ముందే స్పష్టమైంది. ఏడుగురు ఎంపీలు ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. కేరళలోని వాయనాడ్ స్థానం కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో ఇవాళ 535 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనబోతున్నారు. స్పీకర్ ఎన్నికకు 268 మెజారిటీ మార్క్. ఎన్డీయే అభ్యర్థికి 293 మంది ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీల మద్దతు ఉంది. 300 మార్కును దాటేందుకు బీజేపీ ఇతర ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read..
Lok Sabha Speaker | ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన తృణమూల్
Mukesh Ambani | మహారాష్ట్ర సీఎం షిండేని కలిసిన ముకేశ్ అంబానీ.. కుమారుడి వివాహానికి ఆహ్వానం
Marriage expenses | విద్య కంటే వివాహమే ఘనం.. పెండ్లికి భారీగా ఖర్చు చేస్తున్న భారతీయులు