Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) పదవికి చేపడుతున్న ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ పాల్గొననుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున స్పీకర్ పదవికి బరిలో నిల్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కె.సురేశ్ (K Suresh)కు మద్దతు ఇవ్వాలని దీదీ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. స్పీకర్ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిందంటూ తృణమూల్ పార్టీ మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. సురేశ్‌ను బరిలోకి దింపడానికి ముందు తమను సంప్రదించలేదని పేర్కొంది.
ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మంగళవారం పార్లమెంట్ వెలుపల మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఎలాంటి చర్చా జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. సురేశ్‌ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’ అని పేర్కొన్నారు. దీంతో స్పీకర్ ఎన్నికలో తృణమూల్ పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన సురేశ్‌కు మద్దతు ఇవ్వాలని తాజాగా దీదీ పార్టీ నిర్ణయించడంతో ఆ అనుమానానికి తెరపడినట్లైంది.
దేశ పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బలం పుంజుకున్న విపక్షం.. తమకు ప్రొటెం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇచ్చేందుకు నిరాకరించడంతో స్పీకర్ పదవికి పోటీ పెట్టాలని నిర్ణయించింది. తొలుత ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సురేష్‌కు ఇస్తారని ఇండియా బ్లాక్ తొలుత అంచనా వేసింది. అలాగే విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించడం లేదని అధికార పక్షం తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ పదవికి పోటీ చేయాలని విపక్షపార్టీ నిర్ణయించింది. స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు పది నిమిషాల ముందు మంగళవారం కాంగ్రెస్ నేత కే సురేష్ నామినేషన్ వేశారు. మరోవైపు 17వ లోక్ సభ స్పీకర్‌గా పని చేసిన బీజేపీ ఎంపీ ఓం బిర్లాను మళ్లీ అధికార పక్షం ప్రతిపాదించింది. సంఖ్యాబలం రీత్యా విపక్షానికి అనుకూలంగా లేకున్నా, పార్లమెంట్ సమావేశానికి హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీతో స్పీకర్ ఎన్నికవుతారు. ఎన్డీఏ కూటమి 293, కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా బ్లాక్ కు 232 ఓట్లు వస్తాయని భావిస్తున్నారు.
ఈ ఎన్నికలో అధికార పక్షం అభ్యర్థి ఓం బిర్లా ముందంజలో ఉన్నట్లు ఎన్నికకు ముందే స్పష్టమైంది. ఏడుగురు ఎంపీలు ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. కేరళలోని వాయనాడ్ స్థానం కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో ఇవాళ 535 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనబోతున్నారు. స్పీకర్ ఎన్నికకు 268 మెజారిటీ మార్క్. ఎన్డీయే అభ్యర్థికి 293 మంది ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీల మద్దతు ఉంది. 300 మార్కును దాటేందుకు బీజేపీ ఇతర ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read..
Janhvi Kapoor: జలకన్యలా జాన్వీ కపూర్.. ఇన్‌స్టాలో పారిస్ ఫోటోలు రిలీజ్
Mukesh Ambani | మహారాష్ట్ర సీఎం షిండేని కలిసిన ముకేశ్ అంబానీ.. కుమారుడి వివాహానికి ఆహ్వానం
SS Rajamouli: రాజమౌళి దంపతులు, షబానా అజ్మీలకు ఆస్కార్ అకాడమీ సభ్యత్వ ఆహ్వానం